
న్యూఢిల్లీ, సూర్య న్యూస్ : జాతీయ షెడ్యూల్డ్ కులాల ఫెలోషిప్ (NFSC) నిధుల మంజూరులో జరుగుతున్న తీవ్ర పరిపాలనా వైఫల్యంపై యువ న్యాయవాది వినోద్ హిందుస్తానీ జాతీయ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేశారు. సాధారణ జేఆర్ఎఫ్ అభ్యర్థులకు, ఎస్సీ పరిశోధక విద్యార్థులకు మధ్య వ్యవస్థాగతంగా చూపుతున్న వివక్షను సమాచార హక్కు చట్టం ద్వారా ఆయన వెలుగులోకి తెచ్చారు.
యూజీసీ-నెట్ పరీక్షల అనంతరం సాధారణ జేఆర్ఎఫ్ జాబితాను వెంటనే విడుదల చేస్తున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA), ఎస్సీ విద్యార్థుల డేటాను మాత్రం అకారణంగా నెలల తరబడి నిలిపివేస్తోంది. ఈ ఏకపక్ష జాప్యం వల్ల అట్టడుగు వర్గాల పరిశోధక విద్యార్థులు తమకు దక్కాల్సిన ఆర్థిక భరోసాను కోల్పోతున్నారని, దీనిపై అవసరమైతే ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఆయన హెచ్చరించారు.
నిస్సహాయతలో అధికారులు
ఈ వ్యవహారంపై ఎస్సీ కమిషన్కు ఎన్ఎస్ఎఫ్డీసీ ఇచ్చిన అధికారిక వివరణలో తమ నిస్సహాయతను అంగీకరించింది. ఫెలోషిప్ విడుదలకు 10 దశల సుదీర్ఘ ప్రక్రియ ఉంటుందని, అభ్యర్థులను స్వతంత్రంగా ఎంపిక చేసే అధికారం తమకు లేనందున కచ్చితమైన గడువు నిర్ణయించలేమని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఎన్ఎఫ్ఎస్సీ, జేఆర్ఎఫ్ జాబితాల ఏకకాల విడుదలకు సంబంధించి అధికారుల మధ్య ఎలాంటి కచ్చితమైన మార్గదర్శకాలు లేదా ఎస్ఓపీ లేదని ఆర్టీఐ ద్వారా వెల్లడైంది.
శాశ్వత పరిష్కారం కోసం డిమాండ్
సెప్టెంబర్ 1న వినోద్ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేయగానే, అధికారులు హడావుడిగా పెండింగ్లో ఉన్న డిసెంబర్ 2025 జాబితాను విడుదల చేశారు. అయితే భవిష్యత్తులో ఇలా జరగకుండా ఉండేందుకు ఎలాంటి శాశ్వత వ్యవస్థాగత పరిష్కారం చూపలేదు. జేఆర్ఎఫ్తో పాటే ఎన్ఎఫ్ఎస్సీ జాబితాను కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఏకకాలంలో విడుదల చేయాలని, లేనిపక్షంలో సివిల్ కోర్టుల్లో న్యాయపోరాటం చేస్తామని వినోద్ హిందుస్థానీ స్పష్టం చేశారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



