
న్యూఢిల్లీ, సూర్య న్యూస్ : తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నెలకొన్న అధ్వాన పరిస్థితులు, మౌలిక సదుపాయాల లేమిపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) తీవ్రంగా స్పందించింది. న్యాయవాది వినోద్ హిందుస్థానీ దాఖలు చేసిన ఫిర్యాదును పరిశీలించిన కమిషన్, ఈ వ్యవహారంపై నాలుగు వారాల్లోగా సమగ్ర ‘యాక్షన్ టేకెన్ రిపోర్ట్’ (Action Taken Report) సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి గురువారం నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య రంగంలో చోటుచేసుకుంటున్న వరుస అవాంఛనీయ ఘటనల నేపథ్యంలో కమిషన్ ఈ కీలక ఆదేశాలు ఇచ్చింది.
న్యాయవాది ఫిర్యాదుతో వెలుగులోకి వాస్తవాలు
రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు కనీస భద్రత కరువైందని, తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆరోపిస్తూ న్యాయవాది వినోద్ హిందుస్థానీ జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. ఆయన సమర్పించిన పిటిషన్‌ను కమిషన్ పరిగణనలోకి తీసుకుని అధికారికంగా కేసు నమోదు చేసింది. ముఖ్యంగా ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలోని స్పెషల్ న్యూబార్న్ కేర్ యూనిట్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటనను ఫిర్యాదులో ప్రధానంగా ప్రస్తావించారు. ఆ ప్రమాదంలో ఇచ్చోడకు చెందిన సభా ఖాన్, ఇంద్రవెల్లికి చెందిన షేకు బాయి, ఉట్నూర్‌కు చెందిన సభా సమ్రీన్‌లకు చెందిన ముగ్గురు నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు.
ఎంజీఎం ఆసుపత్రి దుస్థితిపై ఆందోళన
వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రిలో నెలకొన్న దయనీయ పరిస్థితులను కూడా వినోద్ హిందుస్థానీ తన ఫిర్యాదులో వివరంగా పేర్కొన్నారు. ఆసుపత్రి వార్డుల్లో పైకప్పులు కూలిపోవడం, చికిత్స పొందుతున్న రోగులపై ఎలుకలు, వీధి జంతువులు దాడులు చేయడం వంటి ఘటనలు వైద్య వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనమని తెలిపారు. సరిపడా పడకలు, వైద్య సిబ్బంది లేకపోవడంతో రోగులకు నేలపైనే చికిత్స అందించాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆర్టికల్ 21 ఉల్లంఘన కిందకే వస్తుందన్న పిటిషనర్
ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ఇలాంటి నిర్లక్ష్యపూరిత పరిస్థితులు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కల్పించిన జీవించే హక్కును కాలరాయడమేనని, ఇది నేరపూరిత నిర్లక్ష్యం కిందకే వస్తుందని వినోద్ హిందుస్థానీ స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ఆసుపత్రులపై తక్షణమే స్వతంత్ర భద్రతా ఆడిట్ నిర్వహించాలని కోరారు. ఆసుపత్రుల్లో పారిశుద్ధ్యం, మౌలిక వసతులను యుద్ధప్రాతిపదికన మెరుగుపరచడంతో పాటు ఖాళీగా ఉన్న వైద్య, సహాయక సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. అగ్నిప్రమాదంలో మరణించిన నవజాత శిశువుల కుటుంబాలకు తగిన ఆర్థిక పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
నాలుగు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశం
ఫిర్యాదులోని తీవ్రతను పరిశీలించిన జాతీయ మానవ హక్కుల కమిషన్, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. ఆసుపత్రుల పరిస్థితుల మెరుగుదలకు తీసుకున్న చర్యలపై ఆంగ్లంలో అనువదించిన పూర్తి నివేదికను హెచ్‌ఆర్‌సీనెట్ పోర్టల్ ద్వారా నాలుగు వారాల్లోగా సమర్పించాలని ఆదేశించింది. కమిషన్ ఆదేశాలతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో కలకలం రేగింది.
ఈ వార్తపై మీ స్పందన?
🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



