
న్యూ ఢిల్లీ, సూర్య న్యూస్ : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో (Telangana Government Hospitals) నెలకొన్న దయనీయ పరిస్థితులు, పాలకుల వ్యవస్థాగత నిర్లక్ష్యంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ తీవ్రస్థాయిలో స్పందించింది. వైద్య రంగానికి బడ్జెట్ కేటాయింపుల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల బాధ్యతారాహిత్యం కారణంగా నిరుపేద రోగుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందంటూ దాఖలైన పిటిషన్‌ను కమిషన్ విచారణకు స్వీకరించి అధికారికంగా కేసు నమోదు చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానాల్లో పసికందుల మరణాలు, కుప్పకూలుతున్న భవనాలు, కనీస సౌకర్యాల లేమిపై హైకోర్టు న్యాయవాది (Advocate Vinod Hindustani) వినోద్ హిందుస్థానీ సమగ్ర ఆధారాలతో జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న కమిషన్ డైరీ నంబర్ 112620/CR/2026 కింద అధికారికంగా కేసును నమోదు చేసింది.
ఆదిలాబాద్ రిమ్స్‌లో సజీవ దహనం
ఆదిలాబాద్ రిమ్స్‌లోని ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ విభాగంలో ఏసీల నిర్వహణ లోపం, షార్ట్ సర్క్యూట్‌తో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు పసికందులు సజీవ దహనం కావడం ప్రభుత్వ క్రిమినల్ నిర్లక్ష్యానికి పరాకాష్ట అని పిటిషన్‌లో న్యాయవాది వినోద్ హిందుస్థానీ పేర్కొన్నారు. దాదాపు 750 పడకల సామర్థ్యం ఉన్న ఆసుపత్రికి కేవలం ముగ్గురు ఎలక్ట్రీషియన్లు మాత్రమే ఉండటం వ్యవస్థాగత వైఫల్యాన్ని స్పష్టం చేస్తోందని ప్రస్తావించారు. ఏసీల మరమ్మతులు సకాలంలో చేయకపోవడం వల్లే ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
పెచ్చులూడుతున్న ఎంజీఎం.. ఎలుకల దాడులు
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో రోగులకు కనీస భద్రత కరవైంది. ఇక్కడ తగినన్ని రేడియంట్ వార్మర్లు, ఇంక్యుబేటర్లు లేక ఒకే వార్మర్‌లో ఇద్దరు ముగ్గురు శిశువులకు చికిత్స అందించాల్సిన దుస్థితి నెలకొంది. ఆసుపత్రిలోని ఆరోగ్యశ్రీ వార్డు, ఆర్ఐసీయూ, ఫిజియోథెరపీ విభాగాల్లో పైకప్పు పెచ్చులూడి రోగుల నెత్తిన పడుతున్నా అధికారులు మరమ్మతులు చేపట్టడం లేదు. ఐసీయూల్లోకి సైతం ఎలుకలు చేరి రోగులను కొరుకుతున్నాయి. వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని ఎలుకలు కొరికిన దారుణ ఘటన ప్రభుత్వ ఆసుపత్రుల పారిశుద్ధ్య లోపానికి అద్దం పడుతోంది. ఆవరణలో వీధి కుక్కల సంచారం రోగుల ప్రాణాలకు ముప్పుగా పరిణమించిందని కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు.
నేలపైనే రోగులకు చికిత్స
రాష్ట్రంలోని పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకలు చాలక గర్భిణులు, వృద్ధులు నేలపైనే పడుకుని చికిత్స పొందుతున్న అమానవీయ పరిస్థితులు దర్శనమిస్తున్నాయి. ఆసుపత్రుల్లో డాక్టర్లు, నర్సులు, సాంకేతిక సిబ్బంది తీవ్ర కొరత వేధిస్తోంది. ఈ పరిస్థితులు భారత రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కు ఆర్టికల్ 21 ఉల్లంఘన కిందకే వస్తాయని వినోద్ హిందుస్థానీ వివరించారు.
త్వరలో సీఎస్‌కు ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు
ఈ సమగ్ర వివరాలను పరిగణనలోకి తీసుకున్న జాతీయ మానవ హక్కుల కమిషన్ తదుపరి చర్యలకు ఉపక్రమించింది. ఈ ఉదంతంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శికి త్వరలోనే నోటీసులు జారీ చేసి సమగ్ర విచారణ నివేదికను కోరనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలు, జిల్లా ఆసుపత్రుల్లో వెంటనే థర్డ్ పార్టీ ఎలక్ట్రికల్, ఫైర్, స్ట్రక్చరల్ ఆడిట్ నిర్వహించాలని పిటిషనర్ డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు తగిన నష్టపరిహారం చెల్లించి, బయోమెడికల్ ఇంజనీర్లు, ఇతర సాంకేతిక సిబ్బందిని తక్షణమే నియమించాలని కోరారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కమిషన్‌ను న్యాయవాది వినోద్ హిందుస్థానీ విజ్ఞప్తి చేశారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



