
అటామిక్ ఎనర్జీ ఎడ్యుకేషన్ సొసైటీ (AEES) నోటిఫికేషన్ 01/2026.. ప్రిన్సిపాల్ నుంచి ప్రైమరీ టీచర్ వరకు పోస్టులు.. నవంబర్ 22 వరకు దరఖాస్తుకు అవకాశం
సూర్య న్యూస్ డెస్క్ : ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలనుకునే నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం నుంచి మంచి అవకాశం వచ్చింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పాఠశాలల్లో వందల సంఖ్యలో టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కేంద్ర ప్రభుత్వ వేతన శ్రేణి ప్రకారం నెలకు గరిష్ఠంగా రూ.2 లక్షలకు పైగా జీతం అందే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు మరికొన్ని రోజుల్లోనే ముగియనుంది. అర్హులైన అభ్యర్థులు ఆలస్యం చేయకుండా దరఖాస్తు చేసుకోవడం మంచిది.
భారత ప్రభుత్వ అణుశక్తి శాఖ పరిధిలోని స్వయంప్రతిపత్తి సంస్థ అయిన అటామిక్ ఎనర్జీ ఎడ్యుకేషన్ సొసైటీ (AEES) భారీ ఉపాధ్యాయ నియామకాలకు నోటిఫికేషన్ (Jobs Notification) విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఏఈఈఎస్ పాఠశాలల్లో ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, పీజీటీ, టీజీటీ, ప్రైమరీ టీచర్ సహా మొత్తం 254 టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు నవంబర్ 22, 2026 రాత్రి 11:50 గంటల లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
ఖాళీల వివరాలు
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 254 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో అత్యధికంగా టీజీటీ (అన్ని సబ్జెక్టులు/పీఈటీ/కళలు) పోస్టులు 102, లైబ్రేరియన్ పోస్టులు 13 ఉండగా, ప్రైమరీ టీచర్ (PRT) పోస్టులు 89 ఉన్నాయి. అలాగే పీజీటీ (అన్ని సబ్జెక్టులు) 27, ప్రైమరీ టీచర్ (సంగీతం) 10, బాల్వాటికా టీచర్ 8, ప్రిన్సిపాల్ 4, వైస్ ప్రిన్సిపాల్ 1 పోస్టు ఖాళీగా ఉన్నాయి.
విద్యార్హతలు
పోస్టును బట్టి అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వీటితో పాటు బీఈడీ/డీఈఐఈడీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పీజీటీ మినహా మిగతా ఉపాధ్యాయ పోస్టులకు సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) అర్హత తప్పనిసరి. ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ పోస్టులకు బోధన/పరిపాలనా అనుభవంతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
వయోపరిమితి
అభ్యర్థుల వయస్సు నవంబర్ 22, 2026 నాటికి లెక్కిస్తారు. అన్ని పోస్టులకు కనీస వయస్సు 18 ఏళ్లు కాగా, ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ పోస్టులకు కనీసం 35 ఏళ్లు ఉండాలి. గరిష్ఠ వయస్సు ప్రైమరీ టీచర్, బాల్వాటికా పోస్టులకు 30 ఏళ్లు, టీజీటీ, లైబ్రేరియన్ పోస్టులకు 35 ఏళ్లు, పీజీటీకి 40 ఏళ్లు, వైస్ ప్రిన్సిపాల్‌కు 45 ఏళ్లు, ప్రిన్సిపాల్‌కు 50 ఏళ్లుగా నిర్ణయించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 నుంచి 15 ఏళ్ల వయోసడలింపు వర్తిస్తుంది. అలాగే మహిళా అభ్యర్థులకు గరిష్ఠంగా 10 ఏళ్ల వయోసడలింపు ఇచ్చారు.
దరఖాస్తు విధానం, ఎంపిక
అర్హులైన అభ్యర్థులు AEES అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు రుసుము కింద జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.1,000 చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికులకు రూ.250 మాత్రమే దరఖాస్తు రుసుముగా నిర్ణయించారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT), ఆ తర్వాత ఇంటర్వ్యూ లేదా స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి పోస్టును బట్టి నెలకు రూ.35,400 నుంచి గరిష్ఠంగా రూ.2,09,200 వరకు వేతనం లభిస్తుంది.
📄 అధికారిక నోటిఫికేషన్, దరఖాస్తు కోసం:
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



