|  
● FLASH NEWS
Rice: కాంగ్రెస్ పాలనలో బియ్యం ధరల మంట.. బీఆర్ఎస్ నేత ఆగ్రహం  •  MEIL: వాటర్ సప్లై ప్రాజెక్టుల్లో ఉద్యోగాలు.. ఆంధ్రాలో వాక్-ఇన్ ఇంటర్వ్యూలు  •  Jobs: కేంద్ర అణుశక్తి శాఖలో 254 టీచర్ ఉద్యోగాలు.. భారీ వేతనంతో  •  Supreme: ప్రభుత్వ ఉద్యోగి 48 గంటలు కస్టడీలో ఉంటే సస్పెండ్ అయినట్లే: సుప్రీంకోర్టు  •  Cinematographer: షూటింగ్‌లో అస్వస్థత.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కన్నుమూత.. సినీ పరిశ్రమలో విషాదం  • 
Skip to content

Rice: సామాన్యుడికి మోయలేని భారంగా బియ్యం ధరలు.. సిండికేట్ల మాయాజాలం

హైదరాబాద్, సూర్య న్యూస్ : తెలుగు రాష్ట్రాల్లో బియ్యం ధరలు (Rice Prices) ఆకాశాన్ని తాకడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే బియ్యం ధరలు కిలోకు ఏకంగా 40 రూపాయల వరకు పెరగడం మార్కెట్ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కకపోగా, మరోవైపు వినియోగదారుడు మాత్రం అధిక ధరలు చెల్లించాల్సి వస్తోంది. ఈ వ్యవహారంలో రైస్ మిల్లర్లు, బడా వ్యాపారుల సిండికేట్ (Rice Syndicate) కోట్లు గడిస్తోందని రైతు సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.

భారీగా పెరిగిన ధరలు

జూలై నెలలో రిటైల్ మార్కెట్‌లో కిలో సోనామసూరి బియ్యం ధర రూ.65 వరకు ఉండగా, అక్టోబర్ నాటికి అది రూ.85 నుంచి రూ.105కి చేరింది. రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తుందన్న వార్తలతో ధరలు తగ్గుతాయని ఆశించిన ప్రజలకు నిరాశే ఎదురైంది. కేవలం బియ్యం మాత్రమే కాకుండా ఇతర నిత్యావసర వస్తువుల ధరలు సైతం విపరీతంగా పెరగడంతో సామాన్యుల బతుకు భారంగా మారింది. ప్రభుత్వ విధానాల్లోని లోపాలు, సిండికేట్ వ్యాపారుల కృత్రిమ కొరత సృష్టించడమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని విమర్శలు వినిపిస్తున్నాయి.

సిండికేట్ల దోపిడీ ఇలా..

వ్యాపారుల సిండికేట్ మార్కెట్ యంత్రాంగాన్ని తమ గుప్పిట్లో పెట్టుకుని ధరలను శాసిస్తోందని రైతుకూలీ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆరోపిస్తున్నారు. ధాన్యం కొనుగోలు నుంచి బియ్యం విక్రయం వరకు ప్రతి దశలోనూ ఈ సిండికేట్ సభ్యులు లాభాలు దండుకుంటున్నారు. పంట చేతికి వచ్చే సమయంలో రైతుల నుంచి ప్రభుత్వ మద్దతు ధర కంటే 15 నుంచి 20 శాతం తక్కువకు ధాన్యం కొనుగోలు చేస్తున్న వ్యాపారులు.. అదే బియ్యాన్ని వినియోగదారులకు అమ్మేటప్పుడు మార్కెట్ ధర కంటే 30 నుంచి 40 శాతం అధికంగా విక్రయిస్తున్నారని వారు మండిపడుతున్నారు. నాణ్యత లేని బియ్యాన్ని పాలిష్ చేసి, బ్రాండెడ్ సంచుల్లో ప్యాక్ చేసి మరీ విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

రేషన్ బియ్యం పాలిష్ చేసి విక్రయాలు

పేదలకు అందాల్సిన ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని సైతం కొందరు వ్యాపారులు కిలో రూ.10 నుంచి రూ.15కు కొనుగోలు చేసి, వాటిని మిల్లుల్లో పాలిష్ పట్టి మార్కెట్లో రూ.40 నుంచి రూ.50కి విక్రయిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. రాజకీయ నాయకులు, అధికార పార్టీ నేతలతో ఉన్న అండదండలతోనే ఈ దందా యథేచ్ఛగా సాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తక్షణమే ప్రభుత్వాలు స్పందించి సిండికేట్ వ్యాపారుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని, అక్రమ నిల్వలను బయటకు తీసి, మేలు రకం బియ్యాన్ని చౌక ధరలకు అందించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp