Skip to content
Home » నిజాంపేటలో దోమల దండు: మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించిన బీజేపీ నాయకులు

నిజాంపేటలో దోమల దండు: మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించిన బీజేపీ నాయకులు

నిజాంపేట: మేడ్చల్ జిల్లా నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దోమల సమస్య తీవ్రరూపం దాల్చింది. కాలనీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై బీజేపీ నిజాంపేట సర్కిల్ నాయకులు శనివారం మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. సర్కిల్ కార్యాలయం లోపల బైఠాయించి అధికారుల తీరుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం​

పలు కాలనీలకు చెందిన మహిళలు, స్థానికులతో కలిసి బీజేపీ నాయకులు కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. మున్సిపల్ అధికారులు, ఎమ్మెల్యే నిర్లక్ష్య వైఖరి వల్లనే పట్టణంలో పారిశుధ్యం క్షీణించిందని, దోమల బెడదతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా ఫిర్యాదు చేస్తున్నా ఫాగింగ్ చర్యలు చేపట్టడం లేదని వారు మండిపడ్డారు.

హామీ ఇచ్చే వరకు సడలని పట్టు

​కమిషనర్ ఛాంబర్ వద్ద బైఠాయించిన నిరసనకారులు.. దోమల నివారణకు తక్షణమే స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాలనీల్లో నెలకొన్న పారిశుధ్య లోపాలను నేరుగా కమిషనర్‌కు వివరించారు. అధికారులు స్పందించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టే వరకు ధర్నా విరమించేది లేదని భీష్మించుక కూర్చున్నారు.​

కమిషనర్ హామీతో సద్దుమణిగిన నిరసన​

బీజేపీ నాయకుల ఆందోళనతో స్పందించిన మున్సిపల్ కమిషనర్.. సంబంధిత అధికారులతో తక్షణమే రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కాలనీల్లో ఫాగింగ్ చేయడంతో పాటు, దోమల నివారణకు పారిశుధ్య చర్యలు వేగవంతం చేస్తామని చెప్పడంతో నాయకులు నిరసన విరమించారు. ఈ కార్యక్రమంలో మూడు డివిజన్ల అధ్యక్షులు ప్రసాద్ రాజు, నరేంద్ర చౌదరి, బిక్షపతి యాదవ్, దళిత మోర్చా రాష్ట్ర నాయకుడు దాసి నాగరాజు, కాసాని సంతోష్, గజ్జల్లి సంతోష్, సంతోష్ గౌడ్, ప్రహ్లాద్, కార్తీక్, అతీష్ బాబు, బీజేవైఎం రాజు తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తను షేర్ చేయండి

మీ అభిప్రాయం తెలియజేయండి.