
హైదరాబాద్, సూర్య న్యూస్ : ఉస్మానియా విశ్వవిద్యాలయం (Osmania University) క్యాంపస్‌లో ఇటీవల ఉద్యోగులు చేపడుతున్న ఆందోళనలు, ర్యాలీలపై పాలకవర్గం తీవ్రంగా స్పందించింది. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తాము సానుకూలంగా ఉన్నప్పటికీ, కొందరు ఉద్దేశపూర్వకంగా యూనివర్సిటీ ప్రశాంత విద్యా వాతావరణాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇలాంటి బెదిరింపు ధోరణులు సరికాదని ఓయూ రిజిస్ట్రార్ ఆచార్య జి. నరేష్ రెడ్డి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.
సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో ఉన్నాం
ఉద్యోగుల సంక్షేమం విషయంలో ఓయూ ఎప్పుడూ ముందుంటుందని రిజిస్ట్రార్ తెలిపారు. వీసీ ఆచార్య కుమార్ మొలుగరం ఇప్పటికే ఉద్యోగ సంఘాలతో జరిపిన చర్చల్లో సానుకూలంగా స్పందించారని, అయితే ఒకరిద్దరి ప్రయోజనాల కోసం చర్చలు విఫలమయ్యాయని ప్రచారం చేయడం తగదని ఆయన హితవు పలికారు. అంతర్గత ప్రమోషన్ల ద్వారా ఇటీవల 150 మందికి పైగా ఉద్యోగులకు పదోన్నతులు కల్పించామని, ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన వారంలోనే ఉద్యోగులందరికీ డీఏ చెల్లించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతన పెంపుపై..
కాంట్రాక్ట్ ఉద్యోగులకు రూ. 1500 పెంచేందుకు వీసీ సానుకూలంగా ఉన్నారని, అయితే పాలకమండలి మూడుసార్లు ఈ ప్రతిపాదనను తిరస్కరించిందని రిజిస్ట్రార్ వివరించారు. ఈ అంశంపై ఆర్థిక శాఖ కార్యదర్శితో మాట్లాడి, త్వరలోనే మళ్లీ ఈసీ ముందుకు తీసుకెళ్తామన్నారు. అలాగే ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS) అమలుపై కూడా ప్రభుత్వంతో చర్చిస్తున్నామని తెలిపారు.
ఈపీఎఫ్ సమస్య పరిష్కారానికి రూ.15 కోట్లు
ఉద్యోగుల ఈపీఎఫ్ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని, ‘విశ్వాస్’ స్కీమ్ అమలు కోసం రూ. 14 నుంచి 15 కోట్లు చెల్లించేందుకు యూనివర్సిటీ సిద్ధంగా ఉందని రిజిస్ట్రార్ ప్రకటించారు. ఎస్బీఐతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఏ ఉద్యోగి మరణించినా రూ. 10 లక్షలు వచ్చేలా ఏర్పాట్లు చేశామన్నారు. యూనివర్సిటీ పరిధిలోని ప్రతి సమస్యను పరిష్కరిస్తామని, పరిధిలో లేని అంశాలపై బెట్టు చేయడం సరికాదని ఆయన స్పష్టం చేశారు. ప్రతి ఉద్యోగి నిబంధనల ప్రకారం నడుచుకోవాలని, కార్యాలయ సమయాల్లో తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని రిజిస్ట్రార్ ఆదేశించారు. తప్పుడు ప్రచారాలతో యూనివర్సిటీ ప్రతిష్టను దెబ్బతీయొద్దని, సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకుందామని ఆయన పిలుపునిచ్చారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



