
సూర్య న్యూస్ డెస్క్ : ఏషియన్ పారా గేమ్స్‌లో (Asian Para Games) భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శనతో అదరగొడుతున్నారు. పోటీల రెండో రోజు భారత్ ఏకంగా 24 పతకాలు సాధించి సత్తా చాటింది. ముఖ్యంగా మహిళల 400 మీటర్ల విభాగంలో తెలంగాణ అథ్లెట్ దీప్తి జీవాంజి (Deepthi Jeevanji) బంగారు పతకం సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచింది.
రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ సాధించిన 24 పతకాల్లో 5 స్వర్ణాలు, 8 రజతాలు, 11 కాంస్య పతకాలు ఉన్నాయి. ఈ తాజా పతకాలతో కలిపి ఈ మెగా క్రీడల్లో భారత్ గెలుపొందిన మొత్తం పతకాల సంఖ్య 35కు చేరుకుంది.
పసిడి పరుగుతో మెరిసిన దీప్తి
ఉమెన్స్ 400 మీటర్ల టీ20 రేసులో బరిలోకి దిగిన తెలంగాణకు చెందిన దీప్తి జీవాంజి.. లక్ష్యాన్ని కేవలం 56.36 సెకన్లలోనే పూర్తి చేసి పసిడి పతకాన్ని ముద్దాడింది. ఈ క్రీడల్లో భారత్‌కు ఇది ఐదో బంగారు పతకం కావడం విశేషం. కాగా, అద్భుతమైన ఫామ్‌లో ఉన్న దీప్తి గత 2024 పారాలింపిక్స్‌లోనూ కాంస్య పతకం సాధించి సత్తా చాటింది.
పసిడి పతకాల విజేతలు వీరే..
దీప్తితో పాటు ఇతర విభాగాల్లోనూ భారత అథ్లెట్లు పసిడి పతకాలతో మెరిశారు. మహిళల 200 మీటర్ల టీ12 విభాగంలో సిమ్రాన్ బంగారు పతకం సాధించింది. పురుషుల కేటగిరీలో డిస్కస్ త్రో (ఎఫ్43/ఎఫ్44/ఎఫ్62/ఎఫ్64) విభాగంలో దేవేందర్ కుమార్ స్వర్ణం నెగ్గగా, హైజంప్ టీ47 విభాగంలో నిషాద్ కుమార్ పసిడి పతకం అందుకున్నాడు. అలాగే డిస్కస్ త్రో (ఎఫ్51/ఎఫ్52/ఎఫ్53) ఈవెంట్లో ప్రణవ్ స్వర్ణ పతకం కైవసం చేసుకున్నాడు. ఇక టేబుల్ టెన్నిస్ విభాగంలో స్టార్ ప్యాడ్లర్ భవీనా పటేల్ కాంస్య పతకం గెలుపొందింది.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



