
నగోయా, సూర్య న్యూస్ డెస్క్ : జపాన్‌లోని ఐచి-నగోయా (Aichi-Nagoya) వేదికగా జరుగుతున్న ఏషియన్ పారా గేమ్స్-2026లో (Asian Para Games 2026) భారత్ పతకాల బోణీ కొట్టింది. పోటీల తొలిరోజే భారత పారా షూటర్లు (Para Shooters) అద్భుత ప్రదర్శనతో సత్తా చాటారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ (10m Air Rifle) SH1 విభాగంలో మోనా అగర్వాల్ (Mona Agarwal) స్వర్ణ పతకం కైవసం చేసుకోగా, మరో షూటర్ అవని లేఖరా (Avani Lekhara) రజత పతకం సాధించారు.
సోమవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ SH1 ఫైనల్లో ఈ ఇద్దరు భారత షూటర్లు అద్భుత ప్రతిభ కనబరిచారు. హోరాహోరీగా సాగిన ఫైనల్ పోరులో మోనా అగర్వాల్ 250.0 రికార్డు పాయింట్లతో గోల్డ్ మెడల్ సొంతం చేసుకుంది. అవని లేఖరా 249.6 పాయింట్లతో కేవలం 0.4 పాయింట్ల తేడాతో తృటిలో స్వర్ణం చేజార్చుకుని సిల్వర్ మెడల్‌తో సరిపెట్టుకుంది. కొరియాకు చెందిన యున్రి లీ కాంస్య పతకం గెలుచుకుంది.
మరో రికార్డు బద్దలుకొట్టిన మోనా అగర్వాల్
ఈ అద్భుత విజయంతో పాటు మోనా అగర్వాల్ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఈ ఫైనల్లో ఆమె సాధించిన 250.0 పాయింట్లు ఏషియన్ పారా గేమ్స్ చరిత్రలోనే రికార్డుగా నమోదైంది. గతంలో అవని లేఖరా నెలకొల్పిన 249.6 పాయింట్ల ఏషియన్ గేమ్స్ రికార్డును మోనా తాజాగా బద్దలు కొట్టడం విశేషం. కాగా, ఇటీవలే ముగిసిన 2024 పారిస్ పారాలింపిక్స్‌లో మోనా అగర్వాల్ కాంస్య పతకం గెలుచుకోగా, అవని లేఖరా స్వర్ణం గెలుచుకున్న విషయం తెలిసిందే. తాజా రజత పతకంతో అవని లేఖరా లాస్ ఏంజెల్స్ 2028 పారాలింపిక్స్‌కు అర్హత సాధించింది.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



