
హైదరాబాద్, సూర్య న్యూస్ : టాలీవుడ్ నటి, బిగ్‌బాస్ సీజన్-3 కంటెస్టెంట్ పునర్నవి భూపాలం ఓ ఇంటికి కోడలైంది. తన చిరకాల ప్రియుడు, ప్రముఖ ఫోటోగ్రాఫర్ హేమంత్ వర్మతో కలిసి శనివారం ఆమె వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహం వైభవంగా జరిగింది.
ఎంగేజ్మెంట్ జరిగిన నెలలోనే వివాహం
పునర్నవి, హేమంత్ వర్మల నిశ్చితార్థం గత ఫిబ్రవరిలో జరిగింది. సరిగ్గా నెల తిరగకముందే ఈ జంట మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. గత ఏడాది డిసెంబర్లో హేమంత్‌ను తన ప్రియుడిగా సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసిన పునర్నవి, అప్పట్లో “హేమంత్ వర్మకు ఎస్ చెప్పేశాను” అంటూ కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అప్పటి నుండి వీరి పెళ్లి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానులకు నేడు పెళ్లి ఫోటోలతో సర్ప్రైజ్ ఇచ్చింది.
వైరల్ అవుతున్న పెళ్లి ఫోటోలు
వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలను పునర్నవి సోషల్ మీడియాలో పంచుకోగా, అవి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. సాంప్రదాయబద్ధంగా జరిగిన ఈ వేడుకలో నూతన వధూవరులు ఎంతో అందంగా కనిపిస్తున్నారు. తమ అభిమాన నటి పెళ్లి చేసుకున్న విషయం తెలుసుకున్న అభిమానులు, నెటిజన్లు పునర్నవి-హేమంత్ జంటకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

సినిమా ప్రస్థానం
’ఉయ్యాల జంపాల’ సినిమాతో హీరోయిన్ ఫ్రెండ్‌గా వెండితెరకు పరిచయమైన పునర్నవి, ఆ తర్వాత ‘పిట్టగోడ’, ‘మనసుకు నచ్చింది’, ‘సైకిల్’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. అయితే బిగ్‌బాస్ సీజన్-3 లో పాల్గొనడం ద్వారా ఈమె బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. బిగ్‌బాస్ తర్వాత ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లిన పునర్నవి, అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్‌లో ఉంటూ వస్తోంది. తాజాగా పెళ్లి పీటలెక్కి తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది.