
రాజేంద్రనగర్, సూర్య న్యూస్ : రాజేంద్రనగర్ పరిధిలోని హైదర్‌గూడలో ఎనిమిదేళ్ల క్రితం 12 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడైన ట్యూషన్ టీచర్‌కు రంగారెడ్డి జిల్లా అదనపు జిల్లా మరియు సెషన్స్ పోక్సో ప్రత్యేక కోర్టు పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది.
2017 డిసెంబర్ మూడవ తేదీన జరిగిన ఈ దారుణ ఘటనలో ఏడవ తరగతి చదువుతున్న బాధితురాలు రోజూలాగే ట్యూషన్ క్లాసుకు వెళ్లగా అదే అపార్ట్మెంట్లో ఉంటూ చెస్ కోచ్‌గా కూడా పనిచేస్తున్న 60 ఏళ్ల నిందితుడు డ్రోణమరాజు సుబ్రమణ్యేశ్వర రావు ఇతర విద్యార్థులు వెళ్లిపోయిన తర్వాత బాలికను తన గదికి పిలిచి అఘాయిత్యానికి పాల్పడ్డాడు, వెంటనే బాలిక ఏడుస్తూ తన తల్లికి ఫోన్ చేసి విషయం చెప్పడంతో డిసెంబర్ నాల్గవ తేదీన తల్లి రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు డిసెంబర్ ఏడవ తేదీన నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
ఈ కేసును తీవ్రంగా పరిగణించిన పోలీసులు ఐపీసీ సెక్షన్ 376(2)(f)(i)తో పాటు పోక్సో మరియు జువైనల్ జస్టిస్ చట్టాల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు, అన్ని సాక్ష్యాధారాలను క్షుణ్ణంగా పరిశీలించిన పోక్సో స్పెషల్ కోర్టు జడ్జి పి ఆంజనేయులు నేరాన్ని నిర్ధారించి నిందితుడికి పదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు ఐదు వేల రూపాయల జరిమానా విధించారు, అలాగే బాధితురాలికి మూడు లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని తీర్పులో స్పష్టం చేస్తూ చిన్నారుల రక్షణ పట్ల న్యాయవ్యవస్థకు ఉన్న చిత్తశుద్ధిని మరోసారి నిరూపించారు.