|  
● FLASH NEWS
Konda Surekha: మంత్రి పదవి పోయిందన్న బాధ లేదు.. అనుచరులపై ఈగవాలినా ఊరుకోం  •  AsianGames: ట్రాక్‌పై భారత అథ్లెట్ల అద్భుత ప్రదర్శన.. ఖాతాలో మరో స్వర్ణం  •  PawanKalyan: వైసీపీ పాలనలో బ్లీచింగ్ పౌడర్ కూడా కొనలేని దుస్థితి  •  AP Liquor: క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మద్యం నాణ్యత తెలుసుకోండి  •  Supreme Court: సుప్రీంకోర్టు జడ్జిగా తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్?  • 
Skip to content

Rent Boyfriend Scam : అమ్మాయిలూ జాగ్రత్త.. ‘రెంట్ బాయ్ ఫ్రెండ్’ పేరుతో ఆన్‌లైన్ వల.. సజ్జనార్ హెచ్చరిక

Hyderabad, Surya News: సోషల్ మీడియా వేదికగా సైబర్ నేరగాళ్లు కొత్త పంథా ఎంచుకున్నారు. ఒంటరిగా ఉన్న యువతులే లక్ష్యంగా రెంట్ బాయ్ ఫ్రెండ్ (Rent Boyfriend) పేరుతో సరికొత్త మోసాలకు తెరలేపారు. ఈ ఆకర్షణీయమైన ప్రకటనల వెనుక ఉన్న భయంకరమైన సైబర్ ఉచ్చు గురించి సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, టెలిగ్రామ్ తదితర సామాజిక మాధ్యమాల్లో రెంట్ బాయ్ ఫ్రెండ్, యువర్ పర్సనల్ కంపానియన్ అనే ఆకర్షణీయమైన పోస్టర్లు ఈ మధ్య విపరీతంగా దర్శనమిస్తున్నాయి. ఏఐ సాంకేతికతతో సృష్టించిన లేదా ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసిన అందమైన యువకుల ఫోటోలను ప్రొఫైల్ పిక్చర్లుగా పెట్టి కేటుగాళ్లు యువతులను ఆకర్షిస్తున్నారు. కాఫీ డేట్ కోసం 499 రూపాయలు, సినిమా డేట్ కోసం 1,249 రూపాయలు, షాపింగ్ తోడుగా రావడానికి 1,499 రూపాయలు, ఈవెంట్లకు 1,999 రూపాయలు, పూర్తి పది గంటల సమయానికి 4,499 రూపాయలు అంటూ 50 శాతం డిస్కౌంట్ ఆఫర్లతో ఒక పెద్ద రేట్ కార్డును సైతం ప్రకటిస్తున్నారు.

​ఈ ఆఫర్లకు ఆకర్షితులై బుకింగ్స్ కోసం డైరెక్ట్ మెసేజ్ చేసిన యువతులతో నేరగాళ్లు తీయటి మాటలతో సంభాషణలు మొదలుపెడతారు. గోప్యత, భద్రత పాటిస్తామని నమ్మించి, బుకింగ్ కన్ఫర్మేషన్ లేదా సెక్యూరిటీ డిపాజిట్ పేరుతో క్యూఆర్ కోడ్లు పంపి ఆన్లైన్ ద్వారా డబ్బులు వసూలు చేస్తారు. అడ్వాన్స్ అమౌంట్ వచ్చిన వెంటనే వారి అకౌంట్లను బ్లాక్ చేసి ఉడాయిస్తారు.

ఒకవేళ ఈ ఆన్‌లైన్ మాటలు నమ్మి అపరిచిత వ్యక్తులను నేరుగా కలవడానికి వెళితే యువతులను సులభంగా ట్రాప్ చేసి తీవ్ర ఇబ్బందులకు గురిచేసే ప్రమాదం ఉందని సజ్జనార్ స్పష్టం చేశారు. చాటింగ్ ద్వారా చాకచక్యంగా సేకరించిన వ్యక్తిగత ఫోటోలు, ఫోన్ నంబర్ల ఆధారంగా ఆ తర్వాత బాధితులను బెదిరించి, బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్నారని ఆయన వివరించారు.

​ఈ కొత్త తరహా సైబర్ మోసాలపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు (Cyber Crime Police) ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ముఠాల ఆటకట్టించేందుకు దర్యాప్తు వేగవంతం చేసి చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో యువతులతో పాటు తల్లిదండ్రులు కూడా అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని పోలీసులు సూచిస్తున్నారు. పిల్లలు సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు చూస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, బయటకు వెళ్లినప్పుడు ఎవరిని కలుస్తున్నారు అనే విషయాలపై తల్లిదండ్రుల నిరంతర పర్యవేక్షణ ఉండాలని హెచ్చరిస్తున్నారు.

ఆకర్షణీయమైన డిస్కౌంట్ ఆఫర్లను చూసి ఎవరూ మోసపోవద్దని సజ్జనార్ సూచించారు. అపరిచిత వ్యక్తులతో ఆన్‌లైన్లో పరిచయాలు పెంచుకోవడం, వారికి ముందస్తుగా డబ్బులు చెల్లించడం లాంటివి చేయవద్దని కోరారు. ఎవరైనా ఇలాంటి సైబర్ నేరగాళ్ల బారిన పడినా, లేదా సామాజిక మాధ్యమాల్లో అనుమానాస్పద పోస్టులు కనిపించినా భయపడకుండా వెంటనే సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నంబర్ 1930 కు కాల్ చేసి లేదా cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp