Skip to content
Home » బాసర ఆర్జీయూకేటీలో భగ్గుమన్న విద్యార్థులు: సరైన వైద్యం లేక విద్యార్థిని మృతి, వీసీ ఇంటి ముందు రాత్రంతా నిరసన

బాసర ఆర్జీయూకేటీలో భగ్గుమన్న విద్యార్థులు: సరైన వైద్యం లేక విద్యార్థిని మృతి, వీసీ ఇంటి ముందు రాత్రంతా నిరసన

బాసర, సూర్య న్యూస్ : సరైన వైద్య సౌకర్యాలు లేకపోవడం వల్లే తమ తోటి విద్యార్థిని ప్రాణాలు కోల్పోయిందని ఆరోపిస్తూ బాసర ఆర్జీయూకేటీ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. ఈ ఘటన క్యాంపస్ లో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీయగా, మంగళవారం సాయంత్రం ప్రారంభమైన నిరసన బుధవారం మధ్యాహ్నం వరకు కొనసాగింది.

క్యాంపస్ ఆసుపత్రిలో వసతుల లేమి వల్లే మృతి:

ఆర్జీయూకేటీలో పీయూసీ రెండో సంవత్సరం చదువుతున్న తేజస్విని అనే విద్యార్థిని ఇటీవల అనారోగ్యానికి గురైంది. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ సోమవారం ఆమె మృతి చెందింది. క్యాంపస్ లో ప్రాథమిక వైద్య సౌకర్యాలు సక్రమంగా లేకపోవడం వల్లే ఈ విషాదం చోటుచేసుకుందని విద్యార్థులు, టీఏఎస్ఏఎస్ నాయకులు ఆరోపించారు. దీనికి నిరసనగా మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో పరిపాలన భవనం వద్దకు చేరుకుని భారీ ఆందోళనకు దిగారు.

వీసీ రాజీనామా హెచ్చరిక, రాత్రంతా నిరసన:

తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఆందోళన విరమించేది లేదని విద్యార్థులు భీష్మించుకు కూర్చున్నారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న ఇన్ ఛార్జి వైస్ ఛాన్సలర్ గోవర్ధన్ పరిస్థితిని చూసి అసహనం వ్యక్తం చేశారు. తాను పదవికి రాజీనామా చేస్తానంటూ అక్కడి నుంచి తన నివాసానికి వెళ్లిపోయారు. దీంతో ఆగ్రహించిన విద్యార్థులు నేరుగా ఇన్ ఛార్జి వీసీ నివాసానికి చేరుకున్నారు. రాత్రంతా చలిని సైతం లెక్కచేయకుండా ఆయన ఇంటి ముందే రోడ్డుపై నిద్రిస్తూ తమ నిరసనను తీవ్రతరం చేశారు.

ఎస్పీ చొరవతో సద్దుమణిగిన ఆందోళన:

పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల రంగంలోకి దిగారు. ఆమె ప్రత్యేక చొరవ తీసుకుని విద్యార్థులతో, అధికారులతో చర్చలు జరిపారు. ఎట్టకేలకు బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఇన్ ఛార్జి వీసీ గోవర్ధన్ తన నివాసం నుంచి బయటకు వచ్చి ఆందోళన చేస్తున్న విద్యార్థులతో మాట్లాడారు. వారు అందజేసిన వినతి పత్రాన్ని ఆయన స్వీకరించడంతో గొడవ సద్దుమణిగింది. మృతి చెందిన తేజస్విని కుటుంబానికి 50 లక్షల రూపాయల నష్టపరిహారం అందజేయాలని, అలాగే విద్యార్థుల ఆరోగ్య భద్రత దృష్ట్యా క్యాంపస్ లోని ఆసుపత్రిని తక్షణమే అప్ గ్రేడ్ చేయాలని విద్యార్థులు ప్రధానంగా డిమాండ్ చేశారు.

ఈ వార్తను షేర్ చేయండి

మీ అభిప్రాయం తెలియజేయండి.