
హైదరాబాద్, సూర్య న్యూస్ : గజ్వేల్ నియోజకవర్గంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) ప్రభావం వేగంగా విస్తరిస్తోంది. గజ్వేల్ ప్రాంతానికి చెందిన పలు రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు తమ తమ పార్టీలకు రాజీనామా చేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో భారీ ఎత్తున చేరారు. హైదరాబాద్లోని టీఆర్పీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సమక్షంలో చేరికలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా చేరిన వారందరికీ తీన్మార్ మల్లన్న పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ, గజ్వేల్లో త్వరలోనే టీఆర్పీ నాయకుల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి భారీ ఎత్తున ప్రజాసభ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. సమాజంలో వెనుకబడిన వర్గాలపై జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించడానికి, బీసీల హక్కుల కోసం పోరాటాన్ని మరింత బలంగా కొనసాగించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. బీసీలపై ఎక్కడ ఎలాంటి అన్యాయం జరిగినా మనమంతా ఐక్యంగా నిలబడాలని, విభేదాలు పక్కనపెట్టి ఒకే దారిలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
సంవత్సరాలుగా ఆధిపత్య వర్గాలు చేస్తున్న దోపిడీకి ముగింపు పలకాలని, బీసీ వర్గాలకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ప్రజల హక్కుల కోసం, సమానత్వ సమాజ నిర్మాణం కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ కట్టుబడి ఉందని, ప్రతి కార్యకర్త ఉద్యమ స్ఫూర్తితో పని చేయాలని తీన్మార్ మల్లన్న సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, గజ్వేల్ ప్రాంతానికి చెందిన ప్రముఖులు మరియు పార్టీ శ్రేణులు భారీగా పాల్గొన్నారు.