Skip to content
Home » కార్పొరేట్ సెలూన్లతో చిన్న వ్యాపారుల జీవనోపాధికి గండి: MLC తీన్మార్ మల్లన్నకు నాయి బ్రాహ్మణుల వినతి!

కార్పొరేట్ సెలూన్లతో చిన్న వ్యాపారుల జీవనోపాధికి గండి: MLC తీన్మార్ మల్లన్నకు నాయి బ్రాహ్మణుల వినతి!

హైదరాబాద్, సూర్య న్యూస్ : హైదరాబాద్ నగరంలో కార్పొరేట్ సెలూన్ సెంటర్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో చిన్న చిన్న కటింగ్ షాపుల యాజమాన్యాలు, నాయి బ్రాహ్మణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు శనివారం తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, MLC తీన్మార్ మల్లన్న గారిని కలిసి వినతిపత్రం అందజేశారు.

​ఈ సందర్భంగా నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు మాట్లాడుతూ, ఒకప్పుడు అరుదుగా ఉండే కార్పొరేట్ సెలూన్లు ఇప్పుడు ప్రతి ప్రాంతంలో, చివరకు జనసంచారం తక్కువగా ఉన్న చిన్న చిన్న గల్లీలలో కూడా స్థాపించబడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల తమ వంటి చిన్న వ్యాపారుల రోజువారీ సంపాదన పూర్తిగా పడిపోయిందని, జీవనోపాధి తీవ్రంగా దెబ్బతింటోందని తెలిపారు. గతంలో ఇలాంటి సమస్యలు పెద్దగా లేకపోయినా, ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని వారు పేర్కొన్నారు. తమ సమస్యలను పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా సరైన స్పందన లేకపోవడంతో, తీన్మార్ మల్లన్న గారిని ఆశ్రయించినట్టు తెలిపారు. తమకు రక్షణ కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకునేలా ఒత్తిడి తీసుకురావాలని కోరారు.

నాయి బ్రాహ్మణుల వినతిపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సానుకూలంగా స్పందించారు. చిన్న చిన్న వృత్తిదారుల జీవనోపాధిని దెబ్బతీసే విధంగా జరుగుతున్న ఈ పరిస్థితిని తాము తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, తగిన పరిష్కారం కోసం ఒత్తిడి తీసుకువస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం చిన్న వ్యాపారులను పట్టించుకోకపోవడం సరికాదని, వారి హక్కుల కోసం తాము పోరాడతామని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నాయి బ్రాహ్మణులకు భరోసా ఇచ్చారు.

ఈ వార్తను షేర్ చేయండి

మీ అభిప్రాయం తెలియజేయండి.