Skip to content
Home » జనజీవన స్రవంతిలోకి రావాలి: మావోయిస్టులకు తెలంగాణ డీజీపీ పిలుపు

జనజీవన స్రవంతిలోకి రావాలి: మావోయిస్టులకు తెలంగాణ డీజీపీ పిలుపు

రెండేళ్లలో 588 మంది లొంగుబాటు.. పునరావాస పథకాలతో అండగా ప్రభుత్వం

హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టులు హింసా మార్గాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలవాలని రాష్ట్ర పోలీసు శాఖ మరోసారి విజ్ఞప్తి చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు, అగ్రశ్రేణి నాయకులు, క్యాడర్లు సామాజిక జీవనంలో చేరి తమ కుటుంబాలతో గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలని తెలంగాణ డీజీపీ బి. శివధర్ రెడ్డి కోరారు.​

రికార్డు స్థాయిలో లొంగుబాట్లు:

గడిచిన రెండేళ్ల కాలంలో తెలంగాణ పోలీసుల నిరంతర కృషితో రికార్డు స్థాయిలో 588 మంది మావోయిస్టు నాయకులు, సభ్యులు లొంగిపోయి సాధారణ జీవితాన్ని గడుపుతున్నారని డీజీపీ వెల్లడించారు. వీరందరికీ ప్రభుత్వం ప్రకటించిన సరెండర్ మరియు పునరావాస విధానం కింద పూర్తిస్థాయిలో ప్రయోజనాలు కల్పించామని ఆయన తెలిపారు. ప్రస్తుతం వారంతా తమ స్వగ్రామాల్లో కుటుంబ సభ్యులతో కలిసి సగౌరవంగా జీవిస్తున్నారని పేర్కొన్నారు.

 ప్రభుత్వ భరోసా:

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పునరావాస కార్యక్రమాలు ఇతర రాష్ట్రాల్లోని మావోయిస్టులను కూడా ఆకర్షిస్తున్నాయని, శాంతియుత పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ప్రెస్ నోట్‌లో పేర్కొన్నారు. లొంగిపోయే వారికి తక్షణ ఆర్థిక సహాయంతో పాటు ప్రభుత్వం నుండి అందాల్సిన అన్ని రకాల సంక్షేమ ఫలాలు అందుతాయని పోలీస్ శాఖ స్పష్టం చేసింది. మారుతున్న కాలానికి అనుగుణంగా అజ్ఞాతంలో ఉన్నవారు వాస్తవ పరిస్థితులను గుర్తించి, అభివృద్ధిలో భాగస్వాములు కావాలని డీజీపీ పిలుపునిచ్చారు.

ఈ వార్తను షేర్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *