
హైదరాబాద్, సూర్య న్యూస్ : తెలంగాణ రాజకీయాల్లో గత కొంతకాలంగా ఉత్కంఠ రేపుతున్న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ బుధవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ఫిరాయించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరియు స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిలపై దాఖలైన అనర్హత పిటిషన్లను స్పీకర్ తిరస్కరించారు. వారు పార్టీ మారినట్లు స్పష్టమైన ఆధారాలు లేవని ఈ సందర్భంగా స్పీకర్ తన తీర్పులో పేర్కొన్నారు.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున గెలిచిన ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు తదనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారని బీఆర్ఎస్ నేతలు స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. పార్టీ ఫిరాయింపుల చట్టం కింద వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే స్పీకర్ విచారణలో దానం నాగేందర్ మరియు కడియం శ్రీహరి ఇచ్చిన వాంగ్మూలాలను పరిగణనలోకి తీసుకున్నారు. తాము ఇప్పటికీ బీఆర్ఎస్ లోనే ఉన్నామని వారు స్పీకర్ కు తెలపడంతో తగిన ఆధారాలు లేవంటూ పిటిషన్లను డిస్మిస్ చేశారు. ఈ నిర్ణయంతో సదరు ఎమ్మెల్యేలకు పెద్ద ఊరట లభించింది.
సుప్రీంకోర్టు విచారణకు ముందే కీలక మలుపుపార్టీ ఫిరాయింపుల అంశంపై రేపు (గురువారం) సుప్రీంకోర్టులో విచారణ జరగాల్సి ఉంది. ఈలోపు స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించాలని గత విచారణలో ధర్మాసనం సూచించింది. ఈ నేపథ్యంలో స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. స్పీకర్ తీర్పుపై స్పందించిన దానం నాగేందర్ మాట్లాడుతూ తనపై అనర్హత వేటు వేసినా పోరాటం ఆపనని, హైదరాబాద్ అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రితో కలిసి పనిచేస్తున్నానని స్పష్టం చేశారు.
రేపు సుప్రీంకోర్టులో జరగబోయే విచారణలో సర్వోన్నత న్యాయస్థానం ఈ అంశంపై ఎలా స్పందిస్తుందో అన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. స్పీకర్ నిర్ణయం తర్వాత తెలంగాణ రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయో వేచి చూడాలి.