న్యూఢిల్లీ, సూర్య న్యూస్ : అక్టోబర్ 15 నుంచి యూపీఐ ద్వారా జరిగే కొన్ని వ్యాపార లావాదేవీలపై ఎండీఆర్ చార్జీలు విధించనున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం (Central Government) కీలక స్పష్టీకరణ ఇచ్చింది. యూపీఐ ఆటోపే (UPI AutoPay) విధానం ద్వారా జరిగే ఆటోమేటిక్ చెల్లింపులకు ఈ చార్జీల నుంచి పూర్తి మినహాయింపు ఉంటుందని వెల్లడించింది.

ఓటీటీ సబ్స్క్రిప్షన్లు, అద్దె బిల్లులు, మ్యూచువల్ ఫండ్లలో చేసే నెలవారీ పెట్టుబడులు వంటి పునరావృత చెల్లింపులు ఆటోపే విధానంలో జరిగితే ఎలాంటి అదనపు రుసుము వర్తించదని ప్రభుత్వం తెలిపింది. అక్టోబర్ 15 నుంచి రెండు వేల రూపాయలకు మించిన వ్యాపార లావాదేవీల పైన మాత్రమే కొత్తగా ఎండీఆర్ విధానం అమలులోకి రానుంది. ఈ చార్జీల భారం కూడా చెల్లింపుల వ్యవస్థలో భాగంగా వ్యాపారులపైనే ఉంటుందని, నేరుగా వినియోగదారుల నుంచి వసూలు చేయబోరని అధికారులు వివరించారు. సాధారణ వ్యక్తుల మధ్య జరిగే యూపీఐ చెల్లింపులు, రెండు వేల లోపు ఉండే వ్యాపార చెల్లింపులు మునుపటిలాగే ఉచితంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.
మర్చంట్ అకౌంట్లపై ప్రత్యేక సూచనలు
గతంలో కొందరు క్యాష్ బ్యాక్ లేదా ఇతర ఆఫర్ల కోసం తమ వ్యక్తిగత యూపీఐ ఖాతాలను మర్చంట్ అకౌంట్‌గా మార్చుకున్నారు. అలాంటి వారు ఒక్కసారి తమ ప్రొఫైల్ చెక్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రొఫైల్ లో మర్చంట్ అని ఉంటే.. రెండు వేల రూపాయలు దాటిన చెల్లింపులపై 0.4 శాతం మేర ఎండీఆర్ వర్తించే అవకాశం ఉంటుంది. అయితే నెలకు లక్ష రూపాయల లోపు యూపీఐ క్యూఆర్ కోడ్ ద్వారా పేమెంట్స్ స్వీకరించే చిన్న వ్యాపారులకు ఎండీఆర్ నుంచి మినహాయింపు ఉంది.
యూపీఐ యాప్ లోని ప్రొఫైల్ లేదా బిజినెస్ పేమెంట్స్ విభాగంలోకి వెళ్లి ఖాతా వివరాలు సులభంగా తెలుసుకోవచ్చు. ఒకవేళ సాధారణ వినియోగదారులు పొరపాటున లేదా గతంలో మర్చంట్ ఖాతాలోకి మారి ఉంటే, వెంటనే సంబంధిత బ్యాంకును లేదా యాప్ సహాయ కేంద్రాన్ని సంప్రదించి ఖాతాను వ్యక్తిగత వినియోగానికి సరిదిద్దుకోవాలని సూచిస్తున్నారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



