Skip to content
Home » Telangana Airports : తెలంగాణలో ఎయిర్‌పోర్ట్‌ల జాతర.. మూడు నెలల్లో వరంగల్ విమానాశ్రయానికి భూమిపూజ!

Telangana Airports : తెలంగాణలో ఎయిర్‌పోర్ట్‌ల జాతర.. మూడు నెలల్లో వరంగల్ విమానాశ్రయానికి భూమిపూజ!

న్యూఢిల్లీ, సూర్య న్యూస్: తెలంగాణలో విమానయాన రంగాన్ని విస్తరించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. రాబోయే మూడు నెలల్లో వరంగల్ (Warangal) మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు శంకుస్థాపన చేయనున్నట్లు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు (Ram Mohan Naidu) వెల్లడించారు. బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (G. Kishan Reddy) తో కలిసి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసిన అనంతరం ఆయన ఈ వివరాలను వెల్లడించారు.

ఏప్రిల్ 17న ఫీల్డ్ సర్వే:

వరంగల్ ఎయిర్‌పోర్ట్ పనులను వేగవంతం చేసేందుకు ఈ నెల 17న క్షేత్రస్థాయిలో ఫీల్డ్ సర్వే నిర్వహించనున్నారు. సివిల్ ఏవియేషన్, డిఫెన్స్ అధికారులు మరియు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు కలిసి ఈ సర్వేలో పాల్గొంటారు. రన్‌వే ఓరియంటేషన్, మాస్టర్ ప్లాన్ ఆమోదం పొందిన వెంటనే భూమిపూజకు ముహూర్తం ఖరారు చేయనున్నారు.

ఆదిలాబాద్, పెద్దపల్లిలోనూ విమానాశ్రయాలు:​

ఆదిలాబాద్ (Adilabad): ఇక్కడ డిఫెన్స్ ఆధ్వర్యంలో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు రక్షణ మంత్రి సానుకూలంగా స్పందించారు. ప్రస్తుతం ఉన్న 360 ఎకరాలకు అదనంగా మరో 450 ఎకరాల భూమి అవసరమని గుర్తించారు. భూసేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి హామీ లభించిందని మంత్రులు తెలిపారు.

పెద్దపల్లి (Peddapalli): పెద్దపల్లి జిల్లా అంతర్గాంలో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు సంబంధించి ఫిజిబిలిటీ రిపోర్ట్ (Feasibility Report) సానుకూలంగా వచ్చిందని మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారిక స్పందన రాగానే పనులు ముందుకు తీసుకెళ్తామన్నారు.

కొత్తగూడెం నాట్ ఫిజిబుల్:

కాగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎయిర్‌పోర్ట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన స్థలం సాంకేతికంగా అనుకూలం కాదని (Not Feasible) కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. దీనిపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించామని తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లోనూ విమాన సౌకర్యం కల్పించాలన్నదే ప్రధాని మోదీ ఆలోచన అని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఈ వార్తను షేర్ చేయండి

మీ అభిప్రాయం తెలియజేయండి.