
నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలోని కేటీఆర్ కాలనీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అత్యంత అర్థవంతంగా జరిగాయి. లోకానికి జీవం పోసే స్త్రీమూర్తులను గౌరవించుకోవడమే లక్ష్యంగా నిజాంపేట్ సర్కిల్ బిఆర్ఎస్ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్ ఆధ్వర్యంలో పారిశుధ్య మహిళా కార్మికులకు ఘన సన్మానం నిర్వహించారు.
స్త్రీ లేనిదే సృష్టికి మనుగడ లేదు
ఈ సందర్భంగా నిజాంపేట్ BRS పార్టీ అధ్యక్షుడు రంగరాయ ప్రసాద్ మాట్లాడుతూ స్త్రీ లేకపోతే జననం, గమనం మరియు సృష్టిలో జీవమే లేదని కొనియాడారు. కంటిపాపలా సమాజాన్ని కాపాడే స్త్రీమూర్తులకు వందనం చేయడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. నగర పారిశుధ్యం కోసం అనునిత్యం శ్రమిస్తున్న 150 మంది మహిళా కార్మికులను ఈ సందర్భంగా సన్మానించి, వారికి చీరలను పంపిణీ చేశారు.

సేవలను గుర్తించడం గర్వకారణం
ఈ కార్యక్రమంలో 11వ డివిజన్ మాజీ కార్పొరేటర్ రవికిరణ్ మాట్లాడుతూ పారిశుధ్య కార్మికుల సేవలను గుర్తించి ఇలా సన్మానించడం అభినందనీయమని తెలిపారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు బొబ్బ శ్రీనివాస్, ప్రదీప్ తాళ్ళురి, కేటీఆర్ కాలనీ అధ్యక్షులు రామకృష్ణ మరియు కాలనీ వాసులు పాల్గొని మహిళా కార్మికులకు తమ సంఘీభావాన్ని ప్రకటించారు.