
హైదరాబాద్:అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ఒక అంతరాష్ట్ర నేరస్థుడిని పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుండి సుమారు మూడు దొంగిలించిన వాహనాలను పోలీసులు రికవరీ చేశారు.
ఉస్మానియా ఆస్పత్రి వద్దే టార్గెట్:
పోలీసుల కథనం ప్రకారం.. అంబర్‌పేటకు చెందిన మహమ్మద్ రియాజ్ ఉద్దీన్ (39) అనే వ్యక్తి లిక్కర్ డిపోలో పని చేస్తూ వ్యసనాలకు బానిసయ్యాడు. జల్సాల కోసం డబ్బు అవసరం అవ్వడంతో ఉస్మానియా ఆస్పత్రి (OGH) ఆవరణ, ఎంజీబీఎస్ పార్కింగ్ ఏరియా మరియు అశోక్ బజార్ ప్రాంతాల్లో తాళం వేసి ఉన్న బైకులను డూప్లికేట్ కీలతో దొంగిలించడం మొదలుపెట్టాడు.
సీసీటీవీ కెమెరాలతో దొరికిపోయాడు:
ఫిబ్రవరి 11న ఉస్మానియా ఆస్పత్రిలో ఒక హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్ చోరీకి గురైనట్లు ఫిర్యాదు అందడంతో అఫ్జల్‌గంజ్ పోలీసులు రంగంలోకి దిగారు. సీసీటీవీ ఫుటేజీని నిశితంగా పరిశీలించిన పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుండి ఒక హీరో స్ప్లెండర్ ప్లస్ మరియు రెండు హోండా యాక్టివా వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అఫ్జల్‌గంజ్ పోలీసులు వెల్లడించారు.