
న్యూఢిల్లీ, సూర్య న్యూస్ : లోక్‌సభ స్థానాల పెంపు, మహిళా రిజర్వేషన్ల అమలుకు ఉద్దేశించిన కీలక బిల్లులపై పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు సోమవారం (నవంబర్ 30) ప్రారంభం కానున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన (Delimitation), మహిళలకు 33 శాతం రిజర్వేషన్ (Women’s Reservation) అంశాలను ముడిపెడుతూ కేంద్రం తీసుకొస్తున్న రాజ్యాంగ (132వ సవరణ) బిల్లు-2026ను కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తొలిరోజే లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ ప్రతిపాదన ప్రకారం లోక్‌సభ గరిష్ఠ సభ్యుల సంఖ్య ప్రస్తుత 550 నుంచి 850కి పెరగనుంది.
పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు గురువారం వెల్లడించిన వివరాల ప్రకారం లోక్‌సభ నవంబర్ 30న, రాజ్యసభ డిసెంబర్ 2న సమావేశమవుతాయి. అత్యవసర ప్రభుత్వ కార్యకలాపాల కోసం ఏర్పాటైన ఈ సిట్టింగ్‌లు డిసెంబర్ 3తో ముగిసే అవకాశం ఉంది. లోక్‌సభ కార్యకలాపాల జాబితా ప్రకారం ఏప్రిల్ 16న ప్రవేశపెట్టిన పాత డీలిమిటేషన్ బిల్లును, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లును ముందుగా ఉపసంహరించుకుని, వాటి స్థానంలో కొత్త రూపాలను ప్రవేశపెడతారు. డీలిమిటేషన్ (సెకండ్) బిల్లును మేఘ్వాల్, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) సెకండ్ బిల్లును హోంమంత్రి అమిత్ షా సభ ముందుంచనున్నారు. డీలిమిటేషన్ (సెకండ్) బిల్లు పరిశీలనకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శనివారం సిఫార్సు చేశారు.
ప్రతి రాష్ట్రానికీ సగం అదనపు సీట్లు
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన ఈ బిల్లు ప్రకారం ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతానికి ఉన్న లోక్‌సభ సీట్లు 50 శాతం పెరుగుతాయి. గరిష్ఠంగా 815 మంది రాష్ట్రాల నుంచి, 35 మంది కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తారు. శాసనసభల గరిష్ఠ పరిమితి కూడా 500 నుంచి 650కి పెరగనుంది. వాస్తవ సీట్ల సంఖ్యను పునర్విభజన ప్రక్రియే తేలుస్తుంది. 1971 జనాభా ఆధారంగా ఉన్న రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తిని 2051 తర్వాతి తొలి జనగణన గణాంకాలు వెలువడే వరకు స్తంభింపజేయాలని బిల్లు ప్రతిపాదిస్తోంది. నియోజకవర్గాల సరిహద్దులను 2011 జనగణన ఆధారంగా నిర్ణయిస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
2023లో వచ్చిన 106వ రాజ్యాంగ సవరణ చట్టం లోక్‌సభ, అసెంబ్లీల్లో మహిళలకు మూడో వంతు సీట్లు కల్పించినా, దాని అమలును జనగణన అనంతరం జరిగే పునర్విభజనతో ముడిపెట్టింది. దీంతో ఆ కోటా ఇప్పటివరకు అమల్లోకి రాలేదు. కొత్త బిల్లు ఆమోదం పొందితే వెంటనే డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటై, 2029 లోక్‌సభ ఎన్నికల నుంచే మహిళా కోటా అమలవుతుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ రిజర్వేషన్ 15 ఏళ్లపాటు కొనసాగుతుంది. మహిళలకు కేటాయించే స్థానాలు రొటేషన్ పద్ధతిలో మారుతాయి. జమ్మూకశ్మీర్ అసెంబ్లీకీ ఈ కోటా వర్తించేలా బిల్లులో ప్రతిపాదించారు.
ఏప్రిల్ వైఫల్యం తర్వాత కొత్త ముసాయిదా
ఏప్రిల్‌లో ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో అవసరమైన మూడింట రెండు వంతుల మెజార్టీ సాధించలేక వీగిపోయింది. అప్పట్లో అనుకూలంగా 298, వ్యతిరేకంగా 230 ఓట్లు రాగా, అవసరమైన సంఖ్యకు 54 ఓట్లు తగ్గాయి. ఆ బిల్లులో అన్ని రాష్ట్రాలకు 50 శాతం సీట్ల పెంపు నిబంధన లేదు. ప్రాంతీయ పార్టీల కీలక డిమాండ్ అయిన ఈ అంశాన్ని ఇప్పుడు చేర్చడంతో డీఎంకే మద్దతు ప్రకటించింది. తమిళనాడుకు ఉన్న 7.18 శాతం లోక్‌సభ వాటా తగ్గకుండా ఉండటం, 1971 జనాభా ఆధారిత నిష్పత్తి కొనసాగడం వంటి తమ రెండు ప్రధాన ఆందోళనలను కొత్త ప్రతిపాదన పరిష్కరించిందని ఆ పార్టీ అధ్యక్షుడు ఎం.కె. స్టాలిన్ పేర్కొన్నారు.
ఉమ్మడిగా వ్యతిరేకిస్తామన్న ఇండియా కూటమి
మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో శనివారం సుమారు రెండు గంటలపాటు జరిగిన 11 పార్టీల భేటీలో ఈ బిల్లును ఉమ్మడిగా వ్యతిరేకించాలని ఇండియా కూటమి నిర్ణయించింది. రాహుల్ గాంధీ, అభిషేక్ బెనర్జీ, కపిల్ సిబల్ తదితరులు హాజరయ్యారు. ఆహ్వానం అందినా డీఎంకే, ఆప్, బీజేడీ ప్రతినిధులు పాల్గొనలేదు. లోక్‌సభను 543 సీట్లకే పరిమితం చేయాలని, ప్రస్తుత సీట్లలోనే మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని, రాష్ట్రాల వారీ సీట్ల కేటాయింపును వచ్చే 25 ఏళ్లు యథాతథంగా ఉంచాలని కూటమి డిమాండ్ చేసింది.
రాజ్యాంగంలోని 330వ అధికరణం ప్రకారం ఎస్సీ, ఎస్టీల జనాభాకు అనుగుణంగా వారి సీట్లు పెరగాల్సి ఉన్నా బిల్లులో ఆ ప్రస్తావన లేదని ఖర్గే ఆరోపించారు. సీట్లను 850కి పెంచడం దేశానికి, ప్రజాస్వామ్యానికి నష్టమని వ్యాఖ్యానించారు. కొనసాగుతున్న జనగణన పూర్తయ్యే వరకు ప్రభుత్వం ఎందుకు ఆగడం లేదని ప్రశ్నించారు. ప్రస్తుత 543 సీట్లలోనే మహిళా కోటా సాధ్యమని, ఉత్తరప్రదేశ్, హరియాణా, మహారాష్ట్రల్లో సరిహద్దుల మార్పులో అవకతవకలు జరిగే ప్రమాదం ఉందని సిబల్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత లోక్‌సభలో ఎస్సీలకు 84, ఎస్టీలకు 47 స్థానాలు రిజర్వ్ అయి ఉన్నాయి.
రాష్ట్రాల ఆమోదం కూడా అవసరం
ఏప్రిల్ తర్వాత సభలో సభ్యత్వంలో మార్పులు వచ్చాయి. 20 మంది టీఎంసీ ఎంపీలు ఎన్డీయేకు మద్దతిస్తున్న నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో విలీనమవుతున్నట్లు జూన్‌లో ప్రకటించారు. వారిపై అనర్హత ప్రక్రియ స్పీకర్ ఓం బిర్లా వద్ద పెండింగ్‌లో ఉంది. ఈసారి మూడింట రెండు వంతుల మెజార్టీ సాధిస్తామని ఎన్డీయే వర్గాలు చెబుతున్నాయి.
ఈ చట్టం అమల్లోకి రావాలంటే పార్లమెంట్లో ప్రత్యేక మెజార్టీతో పాటు కనీసం సగం రాష్ట్ర శాసనసభల ఆమోదం కూడా అవసరం. సోమవారం నుంచి మొదలయ్యే సమావేశాల్లో బిల్లు ప్రవేశం, చర్చ తదుపరి పరిణామాలపైనే రాజకీయ పార్టీల దృష్టి నిలిచింది.
ఈ వార్తపై మీ స్పందన?
🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు




