రాష్ట్ర ఆర్థిక ప్రగతితో పాటు పర్యావరణ పరిరక్షణ కూడా అంతే ముఖ్యమని స్పష్టం చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. నిబంధనలు అమలు చేయాలని కాలుష్య నియంత్రణ మండలికి ఆదేశాలు

Amaravati, Surya News: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర ఆర్థిక ప్రగతికి పారిశ్రామిక అభివృద్ధి ఎంత అవసరమో, పర్యావరణ పరిరక్షణ కూడా అంతే ముఖ్యమని ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) స్పష్టం చేశారు. కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలోని ప్రతి పరిశ్రమ తమ ప్రాంగణంలో కనీసం 33 శాతం పచ్చదనాన్ని అభివృద్ధి చేసి, సంరక్షించాలని ఆయన ఆదేశించారు.
రాష్ట్రంలోని పరిశ్రమలన్నీ పర్యావరణ నిబంధనలను తప్పక పాటించాలన్న విషయాన్ని ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు. పచ్చదనం పెంపును ప్రతి పారిశ్రామికవేత్త ఒక సామాజిక బాధ్యతగా స్వీకరించి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ 33 శాతం పచ్చదనం నిబంధన కచ్చితంగా అమలయ్యేలా కాలుష్య నియంత్రణ మండలి, ఏపీ గ్రీన్ సంస్థలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
2026 గణాంకాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా పోర్టులు, సిమెంట్, మైనింగ్, ఎనర్జీ, ఆహార శుద్ధి, ప్లాస్టిక్, పేపర్ తదితర రంగాలకు చెందిన సుమారు 3,400 పరిశ్రమలు వేలాది ఎకరాల విస్తీర్ణంలో తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. కాగా, ఇప్పటికే కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో 14 రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఇందులో భాగంగా తొలి విడతగా 26 పరిశ్రమల్లో 129 ఎకరాల విస్తీర్ణంలో పచ్చదనం పెంపొందించే పైలట్ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేసినట్లు పవన్ కల్యాణ్ వివరించారు.
ఇదే స్ఫూర్తితో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పరిశ్రమలు 33 శాతం పచ్చదనం లక్ష్య సాధనలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. 2047 నాటికి రాష్ట్ర భూభాగంలో 50 శాతం పచ్చదనాన్ని సాధించాలన్న బృహత్తర సంకల్పంలో పారిశ్రామిక వర్గాలు చురుకుగా పాల్గొనాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



