మర్రిగూడ మండల ‘సరిహద్దు గ్రామాల్లో ‘ దొంగల స్వైరవిహారం..
పక్కా స్కెచ్‌తోనే వరుస చోరీలు ??
తాళం వేసిన ఇండ్లే లక్ష్యం..!

మర్రిగూడ, (సూర్య న్యూస్):నిన్న శివన్నగూడెం.. నేడు ఖుదాబక్షపల్లి.. రేపు ఏ ఊరో? మర్రిగూడ మండలంలో వరుస దొంగతనాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రధానంగా రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల సరిహద్దుల్లో ఉన్న గ్రామాలను లక్ష్యంగా చేసుకుని దొంగల ముఠా రెచ్చిపోతుండటం పోలీసులకు సవాల్‌గా మారింది.
ఈజీ ఎస్కేప్.. సిటీకే జంప్!
మర్రిగూడ మండలంలోని ఈ గ్రామాలు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సరిహద్దుల్లో ఉండటం దొంగలకు అనుకూలంగా మారుతోంది. చోరీకి పాల్పడిన వెంటనే హైవేలు, గ్రామీణ రోడ్ల గుండా సులభంగా నగరంలోకి ఉడాయించి తలదాచుకునేందుకు అవకాశం ఉండటంతోనే, ఈ బోర్డర్ గ్రామాలను ఎంచుకున్నట్లు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ యాంగిల్‌లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిటీ శివార్లలో ఉండే పాత నేరస్తులు లేదా అంతర్జిల్లాల దొంగల ముఠా పనే ఇదై ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. దొంగిలించిన నగలను సిటీలోని బ్రోకర్లకు సులువుగా విక్రయించే అవకాశం ఉండటం కూడా సరిహద్దు చోరీలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
పగలు రెక్కీ.. రాత్రి చోరీ
దొంగలు ఆషామాషీగా కాకుండా పక్కా ప్రణాళికతోనే బరిలోకి దిగుతున్నట్లు స్పష్టమవుతోంది. పగటి పూట పాత సామాన్లు కొనేవారిలాగానో, లేక సేల్స్ మెన్ లాగానో గ్రామాల్లో రెక్కీ నిర్వహిస్తూ, తాళం వేసిన ఇళ్లనే పక్కాగా టార్గెట్ చేస్తున్నారు.
ఖుదాబక్షపల్లిలో: వైద్యం కోసం హైదరాబాద్ వెళ్లిన ఓ ఇంటి తాళం పగలగొట్టి 2 తులాల బంగారం, 30 తులాల వెండిని దొంగిలించారు.
శివన్నగూడెంలో: కొడుకును చూసేందుకు నగరానికి వెళ్లిన చిలుకూరి యాదయ్య ఇల్లు, అలాగే సింగపూర్ వెళ్లిన గంజి శ్రీనివాస్ ఇల్లు.. ఇలా యజమానులు ఊళ్లో లేని ఇళ్లనే ఎంచుకున్నారు. ఇక్కడ 3 తులాల బంగారు చైన్, 12 తులాల వెండి పట్టీలు, రూ.11 వేల నగదు దోచుకెళ్లారు.
పక్కాగా సమాచారం తెలుసుకునే వీరు ఈ చోరీలకు పాల్పడుతుండటంతో, స్థానికంగా ఎవరైనా దొంగలకు ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారా? అన్న కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు.
నిఘా వైఫల్యం.. నేరస్తులకు వరం
గ్రామాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు సరిగ్గా పనిచేయకపోవడం దొంగలకు కలిసొచ్చింది. నేరస్తులు ఎటువైపు నుంచి వస్తున్నారు, ఏ వాహనాలపై పరారవుతున్నారు అనే కచ్చితమైన ఆధారాలు లేకుండా పోయాయి. సమాచారం అందుకున్న ఎస్ఐ బి. రాంబాబు నేతృత్వంలో క్లూస్ టీమ్, ఫింగర్ ప్రింట్ నిపుణులు రంగంలోకి దిగారు. ఘటనా స్థలంలో దొరికిన వేలిముద్రలను పాత నేరస్తుల డేటాతో సరిపోల్చే పనిలో పడ్డారు. మొబైల్ టవర్ డంప్ ఆధారంగా సరిహద్దుల గుండా రాకపోకలు సాగించిన అనుమానితుల నంబర్లను సైతం ట్రేస్ చేస్తున్నట్లు సమాచారం.
హడలెత్తిపోతున్న జనం
వారం రోజుల వ్యవధిలోనే వరుసగా చోరీలు జరగడం, అదీ సరిహద్దు గ్రామాలే లక్ష్యంగా ముఠాలు కదులుతుండటంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. పనిచేయని సీసీ కెమెరాలను తక్షణమే పునరుద్ధరించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. రాత్రి వేళల్లో పోలీసుల గస్తీని ముమ్మరం చేసి, బోర్డర్ చెక్ పోస్టుల వద్ద నిఘా పెంచాలని, అప్పుడే తమకు రక్షణ ఉంటుందని వారు కోరుతున్నారు.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



