ముస్లింలు దేశంలో ఉండకూడదనేవాడు అసలు హిందువే కాదు: మోహన్ భగవత్

న్యూయార్క్: భారత్‌లో ముస్లింలు ఉండకూడదని ఏ హిందువైనా భావిస్తే, అతడు అసలు హిందువే కాజాలడని ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘ చాలక్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. భిన్నత్వంలో ఏకత్వం అనేది భారతీయ డీఎన్‌ఏలోనే అంతర్భాగమని ఉద్ఘాటించారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన, న్యూయార్క్‌లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో ‘అమెరికన్ హిందూస్ ఫర్ ఎంగేజ్‌మెంట్ అండ్ డైలాగ్’ (AHEAD) ఆధ్వర్యంలో జరిగిన ‘విశ్వ ఏకత్వ వేడుక’లో ముఖ్య అతిథిగా ప్రసంగించారు.
మానవత్వమే అసలైన ధర్మం
అమెరికా అనగానే బహుళత్వం (Pluralism) గుర్తుకొస్తుందని, అదే భారత్ గురించి చర్చిస్తే ‘భిన్నత్వంలో ఏకత్వం’ స్ఫురిస్తుందని భగవత్ అన్నారు. విభేదాలను పక్కనబెట్టి అందరినీ సోదరభావంతో చూడటమే నిజమైన ధర్మమని.. మా మాట వింటేనే రక్షణ కల్పిస్తామనడం రాక్షస ప్రవృత్తి అని విశ్లేషించారు. ప్రపంచానికి ఐక్యతా సందేశాన్ని చాటిచెప్పడమే భారత లక్ష్యమన్న స్వామి వివేకానంద మాటలను ఈ సందర్భంగా గుర్తుచేశారు. సమాజం, ప్రకృతి పట్ల మనకున్న బాధ్యతను నెరవేర్చాలని ప్రవాస భారతీయులకు పిలుపునిచ్చారు.
విశ్వ శాంతి కోసం 5 సూత్రాలు
ఈ అంతర్జాతీయ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా 30 దేశాలకు చెందిన 180 మంది మత నాయకులు పాల్గొన్నారు. విశ్వ శాంతి కోసం ‘ఒకే ప్రపంచం – ఒకే మానవత్వం’ పేరిట 5 సూత్రాల కార్యాచరణను ప్రకటించారు. మతం పేరుతో ద్వేషం, హింసను ప్రేరేపించడాన్ని ముక్తకంఠంతో ఖండించారు. ఈ సదస్సుకు 29 దేశాల నుంచి సుమారు 6 వేల మంది ప్రతినిధులు హాజరయ్యారు. వేడుకల ప్రారంభంలో అందరూ ఒకరికొకరు రాఖీలు కట్టుకుని సోదరభావాన్ని చాటుకున్నారు.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



