
జహీరాబాద్, సూర్య న్యూస్ : రాష్ట్రంలో ప్రతిపక్ష నేతల గొంతు నొక్కాలని చూస్తే చూస్తూ ఊరుకునేది లేదని బీజేపీ సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి నౌబాద్ జగన్నాథ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బీజేపీ కార్యాలయాలు, నాయకుల ఇళ్లపై జరుగుతున్న దాడులను, పార్టీ నేతల అక్రమ అరెస్టులను ఆయన తీవ్రంగా ఖండించారు.
దాడులు, అరెస్టులపై ఆగ్రహం
తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై, అలాగే నల్లగొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడటాన్ని జగన్నాథ్ తప్పుబట్టారు. ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలిచే రాజకీయ పార్టీల కార్యాలయాలపై దాడులు చేయడం దుర్మార్గమైన చర్యగా ఆయన అభివర్ణించారు. దాడుల అనంతరం బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్న బీజేపీ సీనియర్ నేత నరపరాజు రామచందర్ రావును పోలీసులు అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ అప్రజాస్వామిక వైఖరికి నిదర్శనమని ఆరోపించారు. నేతలను పదేపదే నిర్బంధించడం ప్రజాస్వామ్య హక్కులపై ప్రత్యక్ష దాడిగా ఆయన విమర్శించారు.
రాజకీయ కక్షసాధింపులు మానుకోవాలి
ప్రతిపక్ష నాయకులను పోలీసు నిర్బంధాలతో అణచివేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ప్రశ్నించే గొంతులను ఎంతగా అణచివేయాలని చూసినా బీజేపీ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని జగన్నాథ్ స్పష్టం చేశారు. పార్టీ కార్యాలయాలపై, నాయకులపై దాడులు చేయడం ప్రభుత్వ విధానమా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన ప్రశ్నించారు. వెంటనే దాడులకు పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అక్రమ అరెస్టులు, దాడులు, బెదిరింపులతో కార్యకర్తలను భయపెట్టడం సాధ్యం కాదన్నారు. “ప్రారంభం మీరు చేశారు.. ముగింపు మేము చేస్తాం.. ఖబడ్దార్” అంటూ జగన్నాథ్ రాష్ట్ర ప్రభుత్వానికి తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



