
హైదరాబాద్, ఫిబ్రవరి 24: నేచురల్ స్టార్ నాని పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ‘దసరా’ వంటి మాస్ హిట్ తర్వాత నానితో మళ్లీ ‘ది ప్యారడైజ్’ (The Paradise) చేస్తున్న యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల పెట్టిన పోస్ట్ ఇప్పుడు ఫిల్మ్ నగర్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. నాని తనపై ఉంచిన నమ్మకాన్ని వివరిస్తూ శ్రీకాంత్ రాసిన మాటలు అభిమానుల మనసు గెలుచుకుంటున్నాయి.
నమ్మకమే అతడి బలం
“నాని అన్నా.. నువ్వు ‘నీ ఇష్టం శ్రీకాంత్’ అన్న ప్రతిసారి నాకు అది ‘నిన్ను నమ్ముతున్నాను శ్రీకాంత్’ అన్నట్లుగా వినిపిస్తుంది” అంటూ శ్రీకాంత్ తన పోస్ట్‌ను ప్రారంభించారు. సినిమా మేకింగ్ లో నాని పెట్టుకున్న ప్రతి నియమాన్ని తాను బ్రేక్ చేసినా, నాని మాత్రం తనను కొత్తగా నిర్మించాడని ఎమోషనల్ అయ్యారు. వర్కింగ్ డేస్ ప్యాటర్న్, రిలీజ్ డేట్ స్ట్రీక్, వర్కింగ్ స్టైల్.. ఇలా నాని ‘మేకింగ్ ఆఫ్ సినిమా’ రూల్స్ అన్నీ బ్రేక్ చేసినా, నాని మాత్రం వెన్నుతట్టి ప్రోత్సహించాడని పేర్కొన్నారు.
టార్చర్ చేసినా సరే.. నీ ఇష్టమే రా!
సినిమా కోసం నానిని తాను పడేసిన ఇబ్బందులను కూడా శ్రీకాంత్ ఇందులో ప్రస్తావించారు. “జుట్టుకు జడలు వేసుకోమన్నా, చేతిపై పచ్చబొట్టు పొడిపించుకోమన్నా, లెక్కలేనన్ని రీటేక్ లతో టార్చర్ చేసినా.. నువ్వు మాత్రం చిరునవ్వుతో ‘సరేరా నీ ఇష్టం’ అనేవాడివి” అని నాని ఓర్పును కొనియాడారు. నాని తనను నమ్మినంతగా ఎవరూ నమ్మలేదని, ఈ జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటానని శ్రీకాంత్ ఓదెల చెప్పుకొచ్చారు.
’ది ప్యారడైజ్’ పై భారీ అంచనాలు
దసరా చిత్రంతో ధరనిగా నానిని ఒక ఊర మాస్ లుక్ లో చూపించిన శ్రీకాంత్, ఇప్పుడు ‘ది ప్యారడైజ్’ లో నానిని మరే రేంజ్ లో చూపించబోతున్నారోనని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడి పట్ల నానికి ఉన్న ఈ అచంచలమైన నమ్మకమే మరో బ్లాక్ బస్టర్ కు పునాది అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.