
హైదరాబాద్, సూర్య న్యూస్ : న్యాచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం ‘ప్యారడైజ్’ (The Paradise Movie) ప్రీమియర్ షోను ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో అభిమానులతో కలిసి చూసేందుకు అనుమతి కోరుతూ ఆయన చేసిన విజ్ఞప్తికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పందించారు. సీఎం సూచనతో గణేష్ నిమజ్జనం ఏర్పాట్ల దృష్ట్యా నాని తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.
ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో సినిమా చూస్తా..
సెప్టెంబర్ 23న జరగనున్న ప్యారడైజ్ ప్రీమియర్ షోను ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని థియేటర్‌లో ప్రేక్షకులతో కలిసి చూడాలని ఉందంటూ సీఎం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తెలంగాణ పోలీసులను ట్యాగ్ చేస్తూ నాని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా కోరారు. చిన్నప్పటి నుంచి ప్రేక్షకులతో కలిసి థియేటర్లలో సినిమా చూడటం తనకు ఇష్టమని, ప్రభుత్వం సూచించే భద్రతా నిబంధనలు పాటిస్తానని తన విజ్ఞప్తిలో పేర్కొన్నారు.
అధికారికంగా దరఖాస్తు చేసుకోండి: సీఎం రేవంత్
నాని ట్వీట్‌పై సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించారు. ప్రజల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ దృష్ట్యా స్థానిక పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తును పరిశీలించి పోలీసులు తగిన నిర్ణయం తీసుకుంటారని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
పోలీసులను ఇబ్బంది పెట్టను
ముఖ్యమంత్రి స్పందనకు నాని వెంటనే కృతజ్ఞతలు తెలియజేశారు. నగరంలో గణేష్ నిమజ్జనం ఏర్పాట్ల కారణంగా పోలీసులపై అదనపు భారం వేయదలుచుకోలేదని స్పష్టం చేశారు. పోలీసుల నిర్ణయానికి పూర్తిగా కట్టుబడి ఉంటామని, భద్రతాపరంగా లేదా ట్రాఫిక్ పరంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే తాను థియేటర్‌కు రావడం మానుకుంటానని ఆయన బదులిచ్చారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



