
హైదరాబాద్, సూర్య న్యూస్ : ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డిపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు (Police Complaint) అందింది. నానక్‌రామ్‌గూడలోని మంత్రి కాస్మోస్ (Mantri Cosmos) భవన ప్రాంగణానికి సంబంధించిన స్థల వివాదం (Land Dispute) నేపథ్యంలో స్థానిక ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పోలీసులను ఆశ్రయించారు.
మంత్రి కాస్మోస్ భవన ప్రాంగణంలోకి చంద్రశేఖర్ రెడ్డి తన అనుచరులతో కలిసి అనుమతి లేకుండా ప్రవేశించారని ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో పాటు, మంత్రి కొండా సురేఖ ఓఎస్‌డీ అనిల్ కుమార్ తమ ఫిర్యాదులో ఆరోపించారు. ప్రాంగణంలోని నైరుతి మూల ఉన్న ప్రధాన గేటు తాళాలు పగలగొట్టి, అక్కడున్న కొన్ని నిర్మాణాలను తొలగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. విధుల్లో ఉన్న సెక్యూరిటీ సిబ్బందిని బెదిరించి అక్కడ రాత్రికి రాత్రే కొత్తగా టిన్ షెడ్లు వేశారని వారు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ వ్యవహారంలో ఆయనతో పాటు మురళీధర్ రెడ్డి, గడ్డం రవి అనే వ్యక్తులు కూడా పాల్గొన్నారని ఆరోపించారు.
ఈ ఆరోపణలకు సంబంధించి ఫిర్యాదుదారులు పోలీసులకు సీసీటీవీ దృశ్యాలను సైతం ఆధారాలుగా అందజేశారు. ఈ స్థల వివాదం నేపథ్యంలో తమకు రక్షణ కల్పించాలంటూ రాష్ట్ర డీజీపీ, సైబరాబాద్ సీపీ, మాదాపూర్ డీసీపీలకు వారు విజ్ఞప్తి చేశారు. బాధితుల నుంచి అందిన ఈ ఫిర్యాదును స్వీకరించిన గచ్చిబౌలి పోలీసులు.. ఘటనా స్థలానికి సంబంధించిన వివరాలు సేకరిస్తూ, ఆరోపణల్లోని వాస్తవాలను ప్రాథమికంగా పరిశీలిస్తున్నారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



