
పుట్టపర్తి, సూర్య న్యూస్ : టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్న తమ తాజా చిత్రం ‘రణబాలి’ (Ranabaali) విడుదలకు ముందు పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయాన్ని సందర్శించారు. దసరా శరన్నవరాత్రి వేడుకల సందర్భంగా సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఈ జంట, విశ్వశాంతిని కాంక్షిస్తూ చేపట్టిన యజ్ఞంలోనూ పాల్గొన్నారు.
సాధారణంగా సినిమా విడుదలకు ముందు టాలీవుడ్ ప్రముఖులు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఆనవాయితీ. అయితే, విజయ్ దేవరకొండ దానికి భిన్నంగా తన జీవితంతో ఎంతో అనుబంధం ఉన్న పుట్టపర్తిని ఎంచుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. తన పాఠశాల విద్యాభ్యాసం మొత్తం పుట్టపర్తిలోనే సాగడంతో ఈ ప్రాంతంపై ఆయనకు ప్రత్యేకమైన అభిమానం ఉంది. తాను చదువుకున్న బడిని, బాల్య స్మృతులున్న ప్రదేశాలను ఆయన రష్మికతో కలిసి సందర్శించారు.

సత్యసాయి బయోపిక్పై ప్రమోషన్స్లో వ్యాఖ్యలు
ఈ పర్యటన నేపథ్యంలో సత్యసాయి బాబా బయోపిక్ గురించి ఇటీవల ‘రణబాలి’ ప్రమోషన్స్, ప్రెస్ మీట్లలో విజయ్ దేవరకొండ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. భగవాన్ సత్యసాయి బాబా బయోపిక్ చేయాలన్న కోరిక తనకు ఎప్పటినుంచో ఉందని ఆయన మనసులోని మాటను పంచుకున్నారు. అయితే, ఆ మహనీయుని పాత్రలో నటించడానికి అవసరమైన సద్గుణాలు, మానసిక పరిణతి తనకు ఇంకా రాలేదని ఆయన ఎంతో నిజాయితీగా అంగీకరించారు. భవిష్యత్తులో తగిన పరిపక్వత వచ్చినప్పుడు కచ్చితంగా ఆ ప్రాజెక్ట్ చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఈ కామెంట్స్ చేసిన కొద్ది రోజులకే ఆయన పుట్టపర్తిని సందర్శించడం విశేషం.

రేపే థియేటర్లలోకి ‘రణబాలి’
రాయలసీమ నేపథ్యంతో తెరకెక్కిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ సినిమా రేపు (అక్టోబర్ 16న) ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల తర్వాత విజయ్, రష్మిక జంటగా నటిస్తున్న మూడో సినిమా కావడంతో దీనిపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తమ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటూ ప్రశాంతి నిలయంలో స్వామివారి ఆశీస్సులు తీసుకున్న ఈ జంట ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



