
మర్రిగూడ, సూర్య న్యూస్ : నల్గొండ జిల్లాలో దశాబ్దాలుగా పట్టిపీడిస్తున్న ఫ్లోరోసిస్ (Fluorosis) పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు వచ్చిన జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) బృందం దృష్టికి న్యాయవాది, సామాజిక కార్యకర్త వినోద్ హిందుస్థానీ పలు కీలక సమస్యలను తీసుకెళ్లారు. బాధితులకు అందుతున్న సాయం, క్షేత్రస్థాయిలో ఇంకా పరిష్కారం కాని అంశాలపై ఆయన అధికారులను నిలదీశారు.
ముఖ్యంగా ఫ్లోరోసిస్ బారిన పడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాత బాధితులకు తగిన ఆర్థిక సహాయం అందించడంలో నిర్లక్ష్యం జరుగుతోందని వినోద్ ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి తోడు వ్యవసాయానికి బోర్ల ద్వారా భూగర్భ జలాలను వినియోగించడం వల్ల వరి తదితర పంటలపై ఫ్లోరైడ్ ప్రభావం పడుతోందని, ఇది భవిష్యత్తులో మరింత ప్రమాదకరంగా మారుతుందని ఆయన అధికారుల దృష్టికి తెచ్చారు.

దీనిపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ అధికారి స్పందిస్తూ.. బాధితులకు ఆర్థిక సాయం అందించే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన ప్రతిపాదనలు వస్తే తప్పకుండా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. అలాగే, పంటలు కలుషితం అవుతున్నాయనడానికి ప్రస్తుతం కచ్చితమైన ఆధారాలు లేనప్పటికీ, వ్యవసాయ భూములపై ఫ్లోరైడ్ ప్రభావం గురించి శాస్త్రీయ పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని ఆయన అంగీకరించారు. ఫ్లోరైడ్ బాధితులకు పూర్తిస్థాయిలో పునరావాసం కల్పించే వరకు వారి పక్షాన తమ పోరాటం కొనసాగుతుందని న్యాయవాది వినోద్ హిందుస్థానీ స్పష్టం చేశారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



