
హైదరాబాద్:నగరంలోని చెరువుల రూపురేఖలు మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్న హైడ్రా, తన మొదటి విడత ప్రాజెక్టులో భాగంగా మరో రెండు కీలక చెరువులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానుంది. ఈ నెల 6వ తేదీన పాతబస్తీలోని బమృకున్-ఉద్-దౌలా చెరువును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనుండగా, ఆ తర్వాత మరో నాలుగు రోజుల్లో కూకట్‌పల్లి నల్లచెరువును కూడా ఆయన ప్రారంభించనున్నారు. ఇప్పటికే అంబర్‌పేటలోని బతుకమ్మ కుంటను హైడ్రా అభివృద్ధి చేసి ప్రారంభించిన విషయం తెలిసిందే.
పాతబస్తీకి మణిహారం: బమృకున్-ఉద్-దౌలా
నిజాంల నాటి చారిత్రక నేపథ్యం ఉన్న బమృకున్-ఉద్-దౌలా చెరువును హైడ్రా అత్యద్భుతంగా తీర్చిదిద్దింది. ఒకప్పుడు కబ్జాలతో ఆనవాళ్లు కోల్పోయిన ఈ చెరువులో ఆక్రమణలను తొలగించి, పాత కట్టను పటిష్టం చేశారు.
ప్రత్యేకతలు: చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, చిన్నారుల కోసం ప్లే ఏరియాలను ఏర్పాటు చేశారు.
చారిత్రక వైభవం: నిజాం పాలకులు ఈ చెరువు నీటిని తాగునీటి అవసరాలకు, ఔషధ గుణాల కోసం ఉపయోగించేవారని చరిత్ర చెబుతోంది. ఆ వైభవాన్ని ప్రతిబింబించేలా చుట్టూ ఔషధ మొక్కలు, నీడనిచ్చే చెట్లను నాటారు.
నిఘా: హైడ్రా ప్రధాన కార్యాలయం నుండి పర్యవేక్షించేలా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

కాంక్రీట్ జంగిల్‌లో బోటు షికారు: కూకట్‌పల్లి నల్లచెరువు
అత్యధిక జనసాంద్రత గల కూకట్‌పల్లి ప్రాంతంలో ఆక్రమణలకు గురై, మురుగునీటితో నిండిన నల్లచెరువును హైడ్రా పూర్తిగా మార్చేసింది.
విస్తీర్ణం పెంపు: 16 ఎకరాలకు కుంచించుకుపోయిన ఈ చెరువును పూడికతీత ద్వారా ఇప్పుడు 30 ఎకరాలకు విస్తరించారు.
అభివృద్ధి: సుమారు 1.5 కిలోమీటర్ల మేర పాత్ వే, బోటు షికారు సౌకర్యం, చెరువులో జీవవైవిధ్యం కోసం ఐలాండ్స్‌ను నిర్మించారు.
వరద కష్టాలకు చెక్: మురుగునీరు కలవకుండా 7 ఇన్-లెట్లను, ఔట్-లెట్లను అభివృద్ధి చేయడం వల్ల చుట్టుపక్కల నివాస ప్రాంతాలకు వరద ముప్పు తప్పింది.

హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యవేక్షణలో యుద్ధ ప్రాతిపదికన జరిగిన ఈ పనుల పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో రెండో విడతలో భాగంగా మరో 14 చెరువులను అభివృద్ధి చేయడానికి హైడ్రా కసరత్తు చేస్తోంది.