
New Delhi, Surya News: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ముసుగులో నిషేధిత భూముల జాబితా (22A Lands) పేరిట సామాన్యుల ఆస్తులను నిలువునా లూటీ చేస్తోందని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత (BJP MP K Laxman) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రెవెన్యూ శాఖ నేరుగా బ్రోకర్ దందాకు తెరలేపి ప్రజల ఆస్తులను దోచుకుంటోందని ఆయన ధ్వజమెత్తారు.
సీఎం రేవంత్ రెడ్డి ఇల్లే నిషేధిత జాబితాలో!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత ఇల్లే 22ఏ నిషేధిత జాబితాలోకి రావడం, ఆపై మంత్రి పొంగులేటి క్షమాపణలు చెప్పడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని లక్ష్మణ్ పేర్కొన్నారు. రాత్రికి రాత్రే ప్రైవేటు భూముల వివరాలను మార్చడం వెనుక భారీ కుట్ర దాగి ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా ఒప్పుకోవడమే ఈ భారీ స్కామ్‌కు తిరుగులేని ఆధారమని స్పష్టం చేశారు.
30 నుంచి 40 శాతం కమీషన్ల కోసం బ్లాక్మెయిల్
జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, రెరా అనుమతులు పొంది చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ పూర్తయిన ఆస్తులను సైతం అకస్మాత్తుగా నిషేధిత జాబితాలో చేరుస్తున్నారని ఎంపీ ఆరోపించారు. ఆ జాబితా నుంచి పేర్లు తొలగించాలంటే 30 నుంచి 40 శాతం వరకు భారీ కమీషన్లు డిమాండ్ చేస్తూ ప్రజలను, బిల్డర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నేతల దందాల వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిని రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా సంక్షోభంలో పడిందన్నారు.
ధరణిని కాదు.. ప్రజలనే ముంచేస్తున్నారు!
ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో వేస్తామని నమ్మబలికిన కాంగ్రెస్ నాయకులు, ఇప్పుడు సామాన్యుల ఆస్తులనే బంగాళాఖాతంలో ముంచుతున్నారని లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 300A కల్పించిన ప్రాథమిక ఆస్తి హక్కును ప్రభుత్వం బహిరంగంగా కాలరాస్తోందని మండిపడ్డారు.
సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి.. శ్వేతపత్రం విడుదల చేయాలి!
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 22ఏ జాబితా నుంచి ఎన్ని వేల ఎకరాల భూములను తొలగించారో తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని డాక్టర్ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. వేల కోట్ల రూపాయల విలువైన ఈ భూదోపిడీపై తక్షణమే సిట్టింగ్ జడ్జితో సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని, బాధితులకు న్యాయం జరిగే వరకు బీజేపీ పక్షాన పల్లెలు, పట్టణాల్లో పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



