
నల్గొండ, సూర్య న్యూస్ : భూభారతిలో చేర్చిన సెక్షన్ 22ఏను (Section 22A) వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ (BJP) ఆధ్వర్యంలో నల్గొండ నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హైదరాబాద్‌కు తరలివెళ్లారు. ఇందిరా పార్క్ వద్ద బీజేపీ రాష్ట్ర నాయకత్వం తలపెట్టిన మహా ధర్నాను విజయవంతం చేసేందుకు నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గ నాయకుడు పిల్లి రామరాజు యాదవ్ నేతృత్వంలో సుమారు 30 కార్లలో పార్టీ శ్రేణులు ర్యాలీగా బయలుదేరారు.
ఈ సందర్భంగా పిల్లి రామరాజు యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. భూభారతిలో 22ఏ సెక్షన్‌ను చేర్చడం ద్వారా పేదలు, రైతుల భూములను క్రయవిక్రయాలు జరపకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆరోపించారు. ఆయా స్థలాలను ప్రభుత్వ భూములుగా నమోదు చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను దోపిడీ చేస్తోందని, ఈ విధానాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మోసపూరిత అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని ఆయన హెచ్చరించారు.
నెరవేరని హామీలు.. కేంద్ర నిధులతోనే అభివృద్ధి
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని రామరాజు యాదవ్ డిమాండ్ చేశారు. మహిళలకు నెలకు రూ. 2500 ఆర్థిక సాయం, ఆసరా పెన్షన్ల పెంపు, ఎస్సీ, బీసీ డిక్లరేషన్ల అమలుతో పాటు నిరుద్యోగులకు వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయాలని ఆయన కోరారు. అలాగే ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న డీఏ, పీఆర్సీలను ప్రకటించి, పదవీ విరమణ పొందిన వారికి రావాల్సిన నిధులను విడుదల చేయాలని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెడలు వంచైనా ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతామని ఆయన తెలిపారు.
నల్గొండ నియోజకవర్గంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇచ్చిన హామీలు గాలి మాటలుగానే మిగిలిపోయాయని రామరాజు యాదవ్ విమర్శించారు. ప్రస్తుతం నల్గొండలో జరుగుతున్న రోడ్లు, ఫ్లైఓవర్ల నిర్మాణాలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుతున్నాయని, ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా ఒక్క రూపాయి కూడా లేదని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోమటిరెడ్డి నర్సింహా రెడ్డి, కార్పొరేటర్ అభ్యర్థులు ఉట్కూరు వెంకట్ రెడ్డి, కందుల శ్రీను, శరత్ తో పాటు పలువురు మండల, పట్టణ పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



