
నార్కట్ పల్లి, సూర్య న్యూస్ : నకిరేకల్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సభను అడ్డుకుంటారనే అనుమానంతో మహాత్మా గాంధీ యూనివర్సిటీకి చెందిన అఖిల భారత విద్యార్థి పరిషత్ (ABVP) నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. విద్యార్థి నాయకులు మోహన్, అజయ్, సతీష్‌లను అదుపులోకి తీసుకుని నార్కట్ పల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ ముందస్తు అరెస్టులపై విద్యార్థి సంఘం నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిల సాధన కోసం విద్యార్థుల పక్షాన నిరంతరం పోరాడుతున్న తమ గొంతును పోలీసుల ద్వారా నొక్కేయాలని చూడటం ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని వారు మండిపడ్డారు. అరెస్టులతో విద్యార్థి ఉద్యమాన్ని అణచివేయలేరని, ఇది ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని విమర్శించారు.
ప్రశ్నించే నాయకులను అరెస్ట్ చేయడం ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనమని వారు ఆరోపించారు. విద్యార్థుల హక్కుల కోసం ఎన్ని నిర్బంధాలు ఎదురైనా వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. అణచివేత పెరిగే కొద్దీ విద్యార్థి ఉద్యమం మరింత ఉధృతమవుతుందని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



