
నల్గొండ, సూర్య న్యూస్ : విద్యారంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో మిలిటెంట్ పోరాటాలు నిర్మిస్తామని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) నేతలు స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎస్వీఆర్ గార్డెన్లో రెండు రోజుల పాటు జరిగిన సంఘం రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణా తరగతులు విజయవంతంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి ఎంపికైన విద్యార్థి ప్రతినిధులు, ప్రొఫెసర్లు, ప్రజా సంఘాల నాయకులు హాజరై పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ముగింపు సమావేశం సందర్భంగా పీడీఎస్ యూ రాష్ట్ర అధ్యక్షుడు పి.మహేష్, ప్రధాన కార్యదర్శి పొడపంగి నాగరాజు మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విద్యా విధానాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్లు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్నాళ్లవుతున్నా విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందని నేతలు ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న రూ.10 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్‌లతో పాటు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్‌కు రూ.200 కోట్లు వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ విద్యను ప్రైవేటీకరించే జీవో 97ను తక్షణమే రద్దు చేయాలని, అలాగే విద్యాశాఖకు ప్రత్యేక మంత్రిని నియమించాలని కోరారు. ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయడంతో పాటు, బడ్జెట్లో విద్యారంగానికి 20 శాతం నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టాలన్నారు. రాబోయే శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లోగా విద్యారంగ సమస్యలపై స్పష్టమైన కార్యాచరణ ప్రకటించకపోతే ‘చలో అసెంబ్లీ’ చేపట్టి ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వ విధానాలపై సైతం విద్యార్థి నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉన్నత విద్యను కార్పొరేటీకరించేలా ఉన్న నూతన జాతీయ విద్యా విధానం-2020ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేసిన విద్యార్థులపై నమోదైన కేసులను ఎత్తివేయాలని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలని కోరారు. దేశంలోని ఐఐటీ, ఎన్ఐటీ తదితర ప్రతిష్టాత్మక సంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలకు ఆర్థిక భారం, కుల అసమానతలే కారణమని వారు ఆరోపించారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే వారిని అర్బన్ నక్సలైట్లుగా ముద్ర వేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ యూ ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జి ఇందూరు సాగర్, జిల్లా అధ్యక్షుడు పోలె పవన్, ప్రధాన కార్యదర్శి కామల్ల సంజయ్, నాయకులు అంబటి శ్రీనాద్, ఇందూరు లోకేష్, గౌతమ్, వేణు, సంతోష్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



