
మేడ్చల్ మల్కాజిగిరి, సూర్య న్యూస్ : బౌరంపేట గ్రామంలోని సర్వే నెంబర్ 472లో ఉన్న ప్రభుత్వ స్థలంలో అసైనీలుగా ఉన్న దళితులకు (Dalit Land Rights) తక్షణమే న్యాయం చేయాలని గ్రామ మాజీ సర్పంచ్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు కొమ్ము మంగమ్మ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం పెద్ద సంఖ్యలో దళిత రైతులతో కలిసి మల్కాజిగిరి (Malkajgiri RDO) ఆర్డీవో శ్యాంప్రకాష్‌ను కలిసి వారు వినతిపత్రం అందజేశారు.
గత 75 ఏళ్లుగా సర్వే నెంబర్ 472లోని సుమారు 32 ఎకరాల ప్రభుత్వ భూమిలో వంద దళిత కుటుంబాలు వ్యవసాయం చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నాయని వారు ఆర్డీవోకు వివరించారు. దశాబ్దాలుగా సాగులో ఉన్న ఆ స్థలాన్ని అసైన్మెంట్ దారులకు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే ప్రభుత్వం అకస్మాత్తుగా వెనక్కి తీసుకోవడం పట్ల వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆ భూమినే నమ్ముకుని బతుకుతున్న పేద దళితుల పట్ల ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించి ఆదుకోవాలని వారు అభ్యర్థించారు. ఈ సమస్యపై ఇప్పటికే దుండిగల్ తహసీల్దార్‌కు కూడా వినతిపత్రం సమర్పించినట్లు వారు తెలిపారు.
దుండిగల్ తరహాలో పరిహారం ఇవ్వాలి
దుండిగల్ గ్రామంలో ఇటీవల అసైన్మెంట్ రైతుల నుంచి ప్రభుత్వం భూములు తిరిగి తీసుకున్న సమయంలో.. పరిహారంగా ప్రతి ఎకరాకు 700 గజాల అభివృద్ధి చేసిన స్థలాన్ని ఇచ్చేందుకు అంగీకరించిందని వారు గుర్తుచేశారు. అదే విధానాన్ని బౌరంపేట దళితులకు కూడా వర్తింపజేయాలని కోరారు. తమకు పరిహారంగా ప్రతి ఎకరాకు వెయ్యి గజాల చొప్పున అభివృద్ధి చేసిన భూమిని కేటాయించాలని విన్నవించారు. దళితుల సమస్యలను సావధానంగా విన్న ఆర్డీవో శ్యాంప్రకాష్ స్పందిస్తూ.. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక దళిత నేతలు డప్పు కిష్టయ్య, కొమ్ము వీరయ్య, కొమ్ము యాదయ్య, డప్పు సురేష్, డప్పు జీవన్, కే రమేష్, నరేష్, చింతకింది రాములమ్మ, ముత్తమ్మ, బాషమ్మ, అనసూయ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



