
హైదరాబాద్, సూర్య న్యూస్ : ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) తన వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఓ అదిరిపోయే బంపర్ ఆఫర్ ప్రకటించింది. కస్టమర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఓ ప్రత్యేకమైన ప్లాన్‌తో మొబైల్ రీఛార్జ్ చేసుకున్న వారికి కాలింగ్, డేటాతో పాటు ఏకంగా లక్ష రూపాయల ఉచిత వ్యక్తిగత ప్రమాద బీమాను అందిస్తున్నట్లు అధికారికంగా వెల్లడించింది. ఇంతకీ ఆ బంపర్ ఆఫర్ దేనికి వర్తిస్తుంది? ఎంత రీఛార్జ్ చేసుకోవాలనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఓరియంటల్ భాగస్వామ్యం, ప్లాన్ ప్రయోజనాలు
ప్రముఖ బీమా సంస్థ ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌తో (OICL) బీఎస్ఎన్ఎల్ ఈ ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకుంది. కస్టమర్లు కేవలం రూ.202 ఎస్టీవీ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే ఈ బీమా ప్రయోజనం ఆటోమేటిక్‌గా వర్తిస్తుంది. ఈ ప్లాన్ ద్వారా సుమారు 30 రోజుల వాలిడిటీతో పాటు 300 నిమిషాల కాలింగ్, 5GB డేటా, 100 ఎస్ఎంఎస్ల ప్రయోజనాలు లభిస్తాయి. వినియోగదారులు మొబైల్ రీఛార్జ్ చేసుకున్న 24 గంటల్లోనే ఈ ఉచిత ప్రమాద బీమా కస్టమర్ ఖాతాకు యాక్టివేట్ అవుతుందని సంస్థ వివరించింది.
ప్రమాద బీమాతో పాటు సైబర్ కవరేజ్
ఈ ప్రత్యేక ప్లాన్ ద్వారా లభించే లక్ష రూపాయల ప్రమాద బీమా.. రోడ్డు ప్రమాదాలు, విద్యుత్ షాక్, పాముకాటు, అగ్ని ప్రమాదాలు, పిడుగులు పడటం తదితర ఊహించని కారణాల వల్ల జరిగే మరణాలకు పూర్తిస్థాయిలో వర్తిస్తుంది. దీనికి తోడు ప్రస్తుతం పెరుగుతున్న ఆన్లైన్ మోసాలను పరిగణనలోకి తీసుకుని రూ.10,000 వరకు సైబర్ ఇన్సూరెన్స్ కవరేజీని సైతం బీఎస్ఎన్ఎల్ అందిస్తోంది. ఆన్లైన్ దొంగతనాలు, ఫిషింగ్ లింక్స్ వంటి సైబర్ నేరాల బారిన పడిన కస్టమర్లకు ఈ కవరేజ్ ఆర్థికంగా ఎంతో ఉపయోగపడుతుంది.
వార్షిక ప్లాన్‌పై కూడా వర్తింపు
కేవలం స్వల్పకాలిక ప్లాన్ మాత్రమే కాకుండా రూ.2,449 వార్షిక ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న కస్టమర్లకు కూడా ఈ ఇన్సూరెన్స్ ప్రయోజనాలు పూర్తిగా అందుబాటులో ఉంటాయని బీఎస్ఎన్ఎల్ తమ అధికారిక ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతా ద్వారా స్పష్టం చేసింది. టెలికాం సేవలతో పాటే కస్టమర్ల భద్రతకు కవరేజ్ లభించడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. ఈ ఉచిత బీమా నిబంధనలు, కవరేజీపై మరిన్ని పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వినియోగదారులు 1800 11 8485 టోల్ ఫ్రీ నంబర్‌ను నేరుగా సంప్రదించవచ్చని అధికారులు సూచించారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



