
విజయవాడ, సూర్య న్యూస్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో (Andhra Pradesh) మెగా డీఎస్సీ వివాదం మరింత ముదురుతోంది. నిన్న విజయవాడలో (Vijayawada) జరిగిన ఆందోళనలు, తోపులాట ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఆందోళనల పేరిట దాడులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ పోలీసులు రంగంలోకి దిగి పలువురు వైసీపీ (YCP) ముఖ్య నేతలు సహా సుమారు 60 మందిపై కేసులు నమోదు చేశారు.
స్పోర్ట్స్ కోటా రగడ.. సీబీఐ విచారణకు డిమాండ్
మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల్లో భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వైసీపీ నాయకులు బందరు రోడ్డులోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్ – SAAP) కార్యాలయం ముట్టడికి యత్నించిన విషయం తెలిసిందే. ఈ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. అయితే వైసీపీ ఆరోపణలను రాష్ట్ర ప్రభుత్వం, శాప్ అధికారులు తీవ్రంగా ఖండించారు. ఇదే సమయంలో స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన అభ్యర్థులు సైతం వైసీపీ నాయకులకు వ్యతిరేకంగా అక్కడే కౌంటర్ ధర్నాకు దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర తోపులాట జరిగి ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది.
కీలక నేతలపై కేసులు నమోదు
ఆందోళనకారులను అడ్డుకునే క్రమంలో వారు పోలీసుల బ్యారికేడ్లను తోసుకురావడంతో.. పోలీసులు స్వల్ప లాఠీచార్జి చేసి వారిని చెదరగొట్టారు. అనంతరం మాజీ మంత్రులు జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాష్, మల్లాది విష్ణు, పేర్ని కిట్టు, జక్కంపూడి రాజా తదితరులను పోలీసులు ప్రివెంటివ్ కస్టడీలోకి తీసుకున్నారు. వీరిపై కృష్ణలంకతో పాటు పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్లు సమాచారం. కాగా, ఈ స్పోర్ట్స్ కోటా వివాదానికి సంబంధించిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు (పిల్) ప్రస్తుతం హైకోర్టు విచారణలో ఉన్నాయి.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



