
రాజమహేంద్రవరం, సూర్య న్యూస్ : తూర్పు గోదావరి జిల్లాలో ఎన్డీఏ కూటమి (NDA Alliance) పార్టీల మధ్య విభేదాలు బహిరంగమయ్యాయి. నిడదవోలు పురపాలక సంఘం ఉపాధ్యక్ష పదవి ఎన్నిక, కడియం జడ్పీటీసీ సీటు మార్పు పరిణామాలు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌కు రాజకీయంగా జంట ఎదురుదెబ్బలుగా (Twin Setbacks) మారాయి.
నిడదవోలు పురపాలక సంఘంలోని మొత్తం 32 వార్డుల్లో టీడీపీ 13, జనసేన 14, వైఎస్సార్సీపీ 3, బీజేపీ ఒకటి, స్వతంత్ర అభ్యర్థి ఒకరు విజయం సాధించారు. ఎన్నికలకు ముందు కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య కుదిరిన అవగాహన ప్రకారం ఛైర్‌పర్సన్ పదవిని జనసేనకు, వైస్ ఛైర్‌పర్సన్ పదవిని టీడీపీకి కేటాయించాలని నిర్ణయించారు. దీని ప్రకారం సోమవారం జనసేన తరఫున మురళ జ్యోతి ఛైర్‌పర్సన్‌గా, ఇతర కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు.
వైస్ ఛైర్‌పర్సన్ ఎన్నికలో ఊహించని తిరుగుబాటు
అయితే అనంతరం జరిగిన వైస్ ఛైర్‌పర్సన్ ఎన్నికలో నాలుగో వార్డు జనసేన కౌన్సిలర్ తోపరాల కల్యాణ్ చక్రవర్తి ఊహించని విధంగా పోటీలో నిలవడంతో పొత్తు లెక్కలు తారుమారయ్యాయి. ఆయనకు 14 మంది జనసేన కౌన్సిలర్లతో పాటు బీజేపీ కౌన్సిలర్ బలిజేపల్లి వెంకట బద్రి లక్ష్మీ విశాల, ఇద్దరు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు, ఛైర్‌పర్సన్ జ్యోతి మద్దతు లభించడంతో మొత్తం 18 ఓట్లు పోలయ్యాయి. టీడీపీ అభ్యర్థి కొమ్మిన వెంకటేశ్వరరావుకు 13 ఓట్లు మాత్రమే రావడంతో ఓటమి పాలయ్యారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్ రాజశేఖర్, స్వతంత్ర కౌన్సిలర్ బూరుగుపల్లి సత్యనారాయణ ఓటింగ్‌లో పాల్గొనలేదు.
ఈ పరిణామంపై టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఛైర్మన్ బూరుగుపల్లి శేషారావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. టీడీపీ జిల్లా బాధ్యులు బొడ్డు వెంకటరమణ చౌదరి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సమక్షంలోనే మంత్రి దుర్గేశ్ తమ అభ్యర్థికి వైస్ ఛైర్‌పర్సన్ పదవి ఇస్తామని బహిరంగంగా హామీ ఇచ్చారని గుర్తుచేశారు. కూటమి విజయం కోసం తమ అభ్యర్థి రూ. 1.50 కోట్లకు పైగా ఖర్చు చేశారని, కౌన్సిలర్ల సమావేశం ఏర్పాటు చేయాలని కోరినా స్పందన లేదని శేషారావు ఆరోపించారు. టీడీపీకి న్యాయం జరగకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు.
మరోవైపు, కూటమి ఒప్పందం ప్రకారం టీడీపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని తాను కౌన్సిలర్లను స్పష్టంగా కోరినా వారు వినలేదని మంత్రి దుర్గేశ్ తెలిపారు. సస్పెన్షన్ హెచ్చరిక జారీ చేసి, విషయాన్ని పార్టీ అధిష్ఠానానికి నివేదించినట్లు పేర్కొన్నారు. నిడదవోలు పట్టణ జనసేన అధ్యక్షుడు రంగ రమేశ్ కూడా కల్యాణ్ చక్రవర్తి అనైతిక పద్ధతులకు పాల్పడి కూటమి స్ఫూర్తిని దెబ్బతీశారని విమర్శిస్తూ రాజీనామా చేయాలని హెచ్చరించారు.
కడియం జడ్పీటీసీపైనా నిరసన సెగ
అంతకుముందు జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ ఎన్నికలోనూ జనసేన శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమైంది. కూటమి ఒప్పందం ప్రకారం కడియం జడ్పీటీసీ సభ్యురాలు రత్నం మహేశ్వరి దేవికి పదవి దక్కుతుందని భావించి, ఆమె ఎన్నిక కోసం మంత్రి దుర్గేశ్ సైతం ప్రయత్నించినట్లు సమాచారం. కానీ చివరి నిమిషంలో సీట్ల సర్దుబాటు మారి టీడీపీకి చెందిన రాయవరం జడ్పీటీసీ కాడా పద్మకు అవకాశం దక్కింది. దీంతో మహేశ్వరి దేవి అనుచరులు రాజమహేంద్రవరంలోని మంత్రి దుర్గేశ్ పార్టీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. కార్యకర్తల తీరుపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. ఈ వరుస ఘటనలతో జిల్లాలో కూటమి సమన్వయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ వార్తపై మీ స్పందన?
🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



