|  
● FLASH NEWS
Warangal: రూ.50 వేల అప్పు కోసం దంపతుల ఆత్మహత్య.. సీవీ ఆనంద్ ఆవేదన  •  SRH: సన్‌రైజర్స్ రిటెన్షన్ లిస్టులో సంచలనం.. ట్రావిస్ హెడ్ ఎందుకు లేరో తెలుసా?  •  PV Sindhu: నాలుగేళ్ల తర్వాత మళ్లీ టాప్ 5లో సింధు.. ఈ ఎదుగుదల వెనుక కథేంటి?  •  SAFF: పాకిస్తాన్‌పై భారత్‌కు పదో ట్రోఫీ.. 88వ నిమిషంలో ఏం జరిగిందో తెలుసా?  •  KTR: కేటీఆర్ సాయంతో కోట్లు టర్నోవర్ సాధిస్తున్న దివ్యాంగుడు  • 
Skip to content

Vidyasagar: బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు అచ్చా విద్యాసాగర్ కన్నుమూత.. ప్రముఖుల సంతాపం

వరంగల్, సూర్య న్యూస్ : తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన వరంగల్ తూర్పు నియోజకవర్గ బీఆర్ఎస్ (BRS) సీనియర్ నేత అచ్చా విద్యాసాగర్ అనారోగ్యంతో బుధవారం సాయంత్రం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రి (Yashoda Hospital)లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ధృవీకరించారు. మలిదశ తెలంగాణ ఉద్యమం (Telangana Movement) తొలి రోజుల నుంచి వరంగల్‌లో కేసీఆర్ వెంట నడిచిన నాయకుల్లో ఆయన ఒకరు.

బీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ ఉద్యమానికి విద్యాసాగర్ అందించిన సేవలు ఎనలేనివని వినోద్ కుమార్ కొనియాడారు. వరంగల్ తూర్పులో ఉద్యమాన్ని ముందుండి నడిపించిన నేత మృతి పార్టీకి, ఉద్యమ శ్రేణులకు తీరని లోటని అన్నారు. విద్యాసాగర్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గ్రేటర్ వరంగల్ తొలి మేయర్, వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కూడా విద్యాసాగర్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పలువురు రాజకీయ ప్రముఖులు, పార్టీ శ్రేణులు ఆయనకు నివాళులర్పించారు.

సంపన్న కుటుంబం నుంచి ఉద్యమ బాటలోకి

అచ్చా రాఘవులు కుమారుడైన విద్యాసాగర్ కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ, ఎల్ఎల్‌బీ పూర్తి చేశారు. వారి కుటుంబానికి వరంగల్‌లో వ్యవసాయ భూములతో పాటు కార్ల డీలర్‌షిప్‌లు, ఇతర వ్యాపారాలు ఉండేవి. 2001లో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించినప్పటి నుంచే విద్యాసాగర్, ఆయన అన్న అచ్చా వీరేశ్ బాబు సహా కుటుంబమంతా ఉద్యమం వెంట నిలిచింది. ఉద్యమ తొలినాళ్లలో వరంగల్ వచ్చినప్పుడు కేసీఆర్ వారి ఇంటికి వచ్చేవారు. ఆచార్య జయశంకర్, కేటీఆర్, హరీశ్ రావు, కవిత వంటి నేతలు నగరానికి వస్తే ఆ ఇంట్లోనే ఆతిథ్యం తీసుకునేవారు. చిన్నపాటి సమావేశాల నుంచి వరంగల్ సింహగర్జన వంటి భారీ బహిరంగ సభల వరకు ఏర్పాట్లలో విద్యాసాగర్ చురుగ్గా పాల్గొన్నారు.

దీక్షా దివస్ రోజుల్లో కేటీఆర్ వెంటే

2009 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగడానికి ముందు తెలంగాణ భవన్‌లో జరిగిన చర్చల్లో వినోద్ కుమార్, పెద్ది సుదర్శన్ రెడ్డి, దాస్యం వినయ భాస్కర్‌లతో కలిసి ఆయన పాల్గొన్నారు. దీక్షకు బయలుదేరిన కేసీఆర్‌ను కరీంనగర్ సమీపంలోని అలుగునూరు చౌరస్తా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డుపైనే బైఠాయించిన ఆయనను అదుపులోకి తీసుకుని వరంగల్ మీదుగా ఖమ్మం జైలుకు తరలించారు. ఆ సమయంలో నగరం దాటే వరకు వాహనాల వెంట నినాదాలు చేస్తూ సాగిన ఉద్యమకారుల్లో విద్యాసాగర్ బృందం ఉంది. అదే సమయంలో అరెస్టై వరంగల్ కేంద్ర కారాగారానికి వచ్చిన కేటీఆర్ వెంట ఉండే బాధ్యతను తమకు అప్పగించారని ఆయన చెప్పేవారు. కేసీఆర్ ఆరోగ్యం విషమించి హైదరాబాద్ నిమ్స్‌కు తరలించిన తర్వాత ఒకవైపు వరంగల్‌లో ఆందోళనలు నడుపుతూనే, మరోవైపు నిమ్స్‌కు వెళ్లి వచ్చేవారు. డిసెంబర్ 9న కేంద్రం ప్రకటన వచ్చే వరకు పదకొండు రోజుల పాటు వరంగల్‌లో ఆందోళనలు ఉద్ధృతంగా సాగాయి. ఉద్యమం కోసం తమ వ్యాపారాలను చాలావరకు వదులుకున్నామని, ఎంతో ఖర్చు చేశామని గత ఏడాది దీక్షా దివస్ సందర్భంగా ఆయన గుర్తుచేసుకున్నారు.

ఒక్కసారి బరిలో.. మూడు పార్టీల ప్రయాణం

2009 సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా వరంగల్ తూర్పు నుంచి విద్యాసాగర్ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయనకు 31,477 ఓట్లు (24.5 శాతం) వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి బస్వరాజు సారయ్య 41,952 ఓట్లతో గెలవగా, ప్రజారాజ్యం అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్ కుమార్ రావు రెండో స్థానంలో నిలిచారు. విద్యాసాగర్ మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఆయనకు దక్కలేదు. 2014 ఎన్నికలకు ముందు కొండా సురేఖ టీఆర్ఎస్‌లో చేరి వరంగల్ తూర్పు టికెట్ దక్కించుకోవడంతో, అక్కడి నుంచి మళ్లీ బరిలో దిగాలనుకున్న ఆయనకు నిరాశే మిగిలింది. పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్న విద్యాసాగర్ ఉద్యమం కోసం ఆస్తులు పోగొట్టుకున్నారని, అలాంటి వ్యక్తిని పక్కనపెట్టారని అప్పట్లో వరంగల్ బీజేపీ నేత రామగళ్ల పరమేశ్వర్ బహిరంగంగానే విమర్శించారు.

రాష్ట్రం ఏర్పడిన తర్వాత పార్టీలో తగిన గుర్తింపు లేదని అసంతృప్తితో ఉన్న ఆయన ఈ విషయమై బహిరంగ లేఖ కూడా రాశారు. 2018 ఏప్రిల్‌లో టీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. అక్కడా ఆశించిన ప్రాధాన్యం దక్కకపోవడంతో 2020 డిసెంబర్‌లో అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకున్నారు. 2023 శాసనసభ ఎన్నికలకు ముందు నవంబర్ 11న హైదరాబాద్‌లో అప్పటి మంత్రి కేటీఆర్ సమక్షంలో తిరిగి బీఆర్ఎస్‌లో చేరారు. జనసేన తూర్పు ఇన్‌చార్జి తాళ్లపెల్లి బాలుగౌడ్, 42వ డివిజన్ కార్పొరేటర్ గుండు చందన పూర్ణచందర్‌లు కూడా అదే రోజు ఆయనతో పాటు గులాబీ కండువా కప్పుకున్నారు. శాసనమండలి అప్పటి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, అప్పటి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, మేయర్ గుండు సుధారాణి ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. అప్పటి నుంచి చివరి వరకు ఆ పార్టీలోనే కొనసాగారు. పదేళ్ల పాలనలో తనకు ఏ అవకాశమూ రాకపోయినా ఎవరినీ నిందించనని, తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ నెరవేరిందన్న సంతోషమే చాలని ఉద్యమ జ్ఞాపకాలు పంచుకున్న సందర్భంలోనే ఆయన అన్నారు.

ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు