
హైదరాబాద్, సూర్య న్యూస్ : తొంభై శాతం అంగవైకల్యాన్ని అధిగమించి, విజయవంతమైన పారిశ్రామికవేత్తగా ఎదిగిన ప్రణవ్ ఎంటర్‌ప్రైజెస్ (Pranav Enterprises) అధినేత చంద్రకాంత్ సాగర్‌ను బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. బుధవారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ను చంద్రకాంత్ సాగర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిరువురు ఆత్మీయంగా మాట్లాడుకుంటూ కలిసి భోజనం చేశారు. అనంతరం చంద్రకాంత్ సాగర్ స్థాపించిన ‘స్వయంకృషి ఫౌండేషన్’ లోగోను కేటీఆర్ ఆవిష్కరించారు.
మీరే నా బ్యాక్ బోన్..
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తాను పరిశ్రమను అభివృద్ధి చేయడానికి కేటీఆర్ ఎంతో అండగా నిలిచారని చంద్రకాంత్ సాగర్ గుర్తుచేసుకున్నారు. “ఉద్యోగం చేయడం కాదు.. ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని మీరు చెప్పిన మాటలు, చేసిన సాయమే నాకు స్ఫూర్తి. మీరే నా బ్యాక్ బోన్. 90 శాతం అంగవైకల్యంతో ఉన్న నేను నేడు ఏకంగా కోటి రూపాయల టర్నోవర్ చేసే స్థాయికి ఎదిగాను” అని ఆయన కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
తోటి దివ్యాంగులకు ఉపాధి
కృషి, పట్టుదల ఉంటే శారీరక లోపం అడ్డంకి కాదని నిరూపించిన చంద్రకాంత్ సాగర్ ప్రయాణం అందరికీ ఆదర్శనీయమని కేటీఆర్ కొనియాడారు. తానొక్కడే ఎదగడమే కాకుండా, తన పరిశ్రమ ద్వారా పలువురు దివ్యాంగులకు ఉపాధి కల్పిస్తుండటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. నూతనంగా ప్రారంభించిన స్వయంకృషి ఫౌండేషన్ ద్వారా ఆయన భవిష్యత్తులో మరింత మందికి అండగా నిలవాలని కేటీఆర్ ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
ఈ వార్తపై మీ స్పందన?
🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



