|  
● FLASH NEWS
Warangal: రూ.50 వేల అప్పు కోసం దంపతుల ఆత్మహత్య.. సీవీ ఆనంద్ ఆవేదన  •  SRH: సన్‌రైజర్స్ రిటెన్షన్ లిస్టులో సంచలనం.. ట్రావిస్ హెడ్ ఎందుకు లేరో తెలుసా?  •  PV Sindhu: నాలుగేళ్ల తర్వాత మళ్లీ టాప్ 5లో సింధు.. ఈ ఎదుగుదల వెనుక కథేంటి?  •  SAFF: పాకిస్తాన్‌పై భారత్‌కు పదో ట్రోఫీ.. 88వ నిమిషంలో ఏం జరిగిందో తెలుసా?  •  KTR: కేటీఆర్ సాయంతో కోట్లు టర్నోవర్ సాధిస్తున్న దివ్యాంగుడు  • 
Skip to content

Warangal: రూ.50 వేల అప్పు కోసం దంపతుల ఆత్మహత్య.. సీవీ ఆనంద్ ఆవేదన

హైదరాబాద్, సూర్య న్యూస్ : వరంగల్ (Warangal) జిల్లాలో కేవలం రూ. 50 వేల అప్పు, వడ్డీ వేధింపుల కారణంగా ఓ మధ్యతరగతి దంపతులు తమ పెంపుడు కుక్కతో సహా ప్రాణాలు తీసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ హృదయ విదారక ఘటనపై డీజీపీ సి.వి. ఆనంద్ (CV Anand) సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో తాను విన్న అత్యంత బాధాకరమైన వార్త ఇదేనని ఆయన పేర్కొన్నారు.

వరంగల్‌లో అసలేం జరిగింది?

వరంగల్‌లోని రంగశాయిపేటకు చెందిన నల్లపోగుల సంజయ్ కుమార్ (60), ఆయన భార్య శోభ (53) ఓ మహిళా టైలర్ వద్ద రూ. 50 వేలు అప్పుగా తీసుకున్నారు. దీనికి వారానికి రూ. 750 చొప్పున ఏడాదికి దాదాపు రూ. 39 వేల వరకు వడ్డీ చెల్లిస్తున్నారు. అయితే వడ్డీ చెల్లింపులో కొంత ఆలస్యం కావడంతో సదరు మహిళ తమను తీవ్రంగా అవమానించిందని వారు తమ సూసైడ్ నోట్‌లో ఆరోపించారు. “దేవుడా.. మమ్మల్ని మళ్లీ మధ్యతరగతి వారిగా పుట్టించకు” అని ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. తమ తదనంతరం పెంపుడు కుక్కకు ఎవరు ఆహారం పెడతారనే భయంతో దాన్ని కూడా చంపి, తమతో పాటే దానికి కూడా అంత్యక్రియలు నిర్వహించాలని కోరుతూ వారు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గేమింగ్ యాప్‌ల బారిన పడుతున్న పోలీసులు

ఈ ఘటనపై స్పందించిన సి.వి. ఆనంద్.. వారానికి రూ. 750 చెల్లించలేని పరిస్థితుల్లో, గౌరవప్రదమైన వ్యక్తులు అవమానాన్ని భరించలేక ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవడం కలచివేసిందన్నారు. తాను స్వయంగా శునక ప్రేమికుడిని కావడంతో, ఆ పెంపుడు కుక్కను కూడా చంపడం తనను మరింత బాధించిందని తెలిపారు. ఇదే సమయంలో పోలీసు శాఖలోని పలువురు కానిస్టేబుళ్లు కూడా గేమింగ్ యాప్‌లకు బానిసలై, అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవల తన దృష్టికి వస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఇలాంటి వ్యసనాలు, సామాజిక రుగ్మతల పట్ల పోలీసు సిబ్బందికి అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని చేపట్టినట్లు సి.వి. ఆనంద్ వెల్లడించారు. కష్టాలను ఎదుర్కొనే ధైర్యం, మనోబలం ఉంటే ఏ సమస్యకైనా తప్పకుండా పరిష్కారం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. సామాన్య ప్రజలతో పాటు పోలీసు అధికారులు కూడా ఎవరూ ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు