
విశాఖపట్నం, సూర్య న్యూస్ : ఉత్తరాంధ్రలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు నిర్వహించిన దాడుల్లో ఇద్దరు రెవెన్యూ అధికారులు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. అనకాపల్లి (Anakapalli) జిల్లాలో ఒక రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ రూ. 50 వేలు, విజయనగరం జిల్లాలో ఒక డిప్యూటీ తహసీల్దార్ రూ. 15 వేలు లంచం తీసుకుంటూ అధికారులకు చిక్కారు. ఈ రెండు ఘటనలు స్థానిక రెవెన్యూ వర్గాల్లో కలకలం రేపాయి.
మ్యుటేషన్ కోసం రూ. 50 వేలు డిమాండ్
అనకాపల్లి జిల్లా కె. కోటపాడు మండలంలోని వారాడ గ్రామానికి చెందిన వర్రి కృష్ణకు సంబంధించిన 1.33 ఎకరాల భూమి ఆన్‌లైన్ రికార్డుల్లో పొరపాటున వేరొకరి పేరుపై నమోదైంది. ఆ రికార్డులను సరిచేసి తన మామగారి పేరు మీదకు బదిలీ చేయాలని కోరుతూ బాధితుడు కె. కోటపాడు తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఫైలుపై విచారణ చేయాల్సిన మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ అడ్డకట్ల నాగేశ్వరరావు పని పూర్తి చేసేందుకు రూ. 50 వేలు లంచం డిమాండ్ చేశారు.
లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు నవంబర్ 14న ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగిన ఏసీబీ డీఎస్పీ బి.వి.వి.ఎస్. రమణమూర్తి బృందం మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో కె. కోటపాడు రెవెన్యూ కార్యాలయంలో వల పన్నింది. బాధితుడి నుంచి నాగేశ్వరరావు రూ. 50 వేలు తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రసాయన పరీక్షలో లంచం తీసుకున్నట్లు నిర్ధారణ కావడంతో నిందితుడిని అరెస్టు చేసి, కార్యాలయంలోని రికార్డులను పరిశీలించిన అనంతరం విశాఖపట్నంలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.
సర్వే నంబర్ మార్పునకు రూ. 15 వేలు
మరో ఘటనలో విజయనగరం పట్టణానికి చెందిన శివరామ్ తన ఖాళీ స్థలానికి సంబంధించిన రికార్డుల్లో తప్పుగా నమోదైన సర్వే నంబర్‌ను సరిచేయించుకునేందుకు రెవెన్యూ అధికారులను ఆశ్రయించారు. ఈ పని చేసిపెట్టేందుకు సంబంధిత డిప్యూటీ తహసీల్దార్ రూ. 15 వేలు లంచం డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు, నిందితుడు రూ. 15 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్టు చేశారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా అధికారులు లేదా సిబ్బంది లంచం డిమాండ్ చేస్తే భయపడకుండా వెంటనే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించి ఫిర్యాదు చేయాలని అధికారులు ఈ సందర్భంగా ప్రజలకు సూచించారు.
ఈ వార్తపై మీ స్పందన?
🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



