
Hyderabad, Surya News:హైదరాబాద్ నగరంలోని కొండాపూర్ (Kondapur) ప్రాంతంలో సినీ హీరో అఖిల్ రాజ్ (Hero Akhil Raj) కారుపై కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. మంగళవారం (జూన్ 30) సాయంత్రం జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ దాడికి సంబంధించి బాధితుడు అఖిల్ రాజ్ గచ్చిబౌలి (Gachibowli) పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కొండాపూర్ లో కొంతమంది తన కారును అడ్డగించి దాడికి యత్నించారని ఆయన పోలీసులకు తెలిపారు.
అసలు ఈ వివాదానికి ప్రధాన కారణం ఒక ఫుడ్ డెలివరీ బాయ్ తో జరిగిన గొడవే అని స్పష్టమవుతోంది. ‘రాజు వెడ్స్ రాంబాయి’ (Raju Weds Rambai) సినిమా ద్వారా గుర్తింపు పొందిన హీరో అఖిల్ రాజ్ ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేయగా, డెలివరీ బాయ్ పొరపాటున వేరే ఆర్డర్ ఇచ్చాడు. దీనిపై తీవ్ర ఆగ్రహానికి గురైన హీరో సదరు డెలివరీ బాయ్ పై దాడి చేశాడు. ఈ దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో (Social Media) విపరీతంగా వైరల్ అయ్యాయి.
ఈ సంఘటన తీవ్ర దుమారం రేపడంతో హీరో అఖిల్ రాజ్ ఒక వీడియో ద్వారా తన వర్షన్ వినిపిస్తూ క్లారిఫికేషన్ ఇచ్చారు. అయితే ఈ వివరణ ఇచ్చిన కొద్దిసేపటికే మంగళవారం సాయంత్రం ఆయన ప్రయాణిస్తున్న కారును కొందరు అడ్డగించి దాడి చేశారు. అఖిల్ రాజ్ కారు అద్దాలపై దాడి చేసినట్లు ఉన్న వీడియో కూడా ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ హఠాపరిణామంతో భయాందోళనకు గురైన అఖిల్ రాజ్ వెంటనే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో (Gachibowli Police Station) ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, ఇరు వర్గాల వాదనలను లోతుగా విచారిస్తున్నారు. దాడికి పాల్పడిన వారిని గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



