ఫతుల్‌గూడలో మూడవ బ్యాచ్ శిక్షణ ప్రారంభం.. 105 మంది వాలంటీర్లకు వారం రోజుల పాటు మెలుకువలు

హైదరాబాద్: ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజలను రక్షించడంలో యువ ఆపద మిత్రులు కీలక పాత్ర పోషించాలని హైడ్రా అడిషనల్ డైరెక్టర్ వర్ల పాపయ్య పిలుపునిచ్చారు. బుధవారం ఫతుల్‌గూడలోని హైడ్రా శిక్షణ కేంద్రంలో ‘యువ ఆపద మిత్ర’ మూడవ బ్యాచ్ శిక్షణా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి ప్రసంగించారు.
తక్షణ సహాయమే లక్ష్యం:
వరదలు, అగ్ని ప్రమాదాల వంటి ఆపద సమయాల్లో స్థానికంగా ఉండే వాలంటీర్లే మొట్టమొదట స్పందిస్తారని, వారు సమర్థ నాయకులుగా వ్యవహరించాలని పాపయ్య సూచించారు. ఫిబ్రవరి 18 నుండి 24 వరకు జరిగే ఈ శిక్షణలో ప్రాణరక్షణ మెలుకువలు, ప్రాథమిక చికిత్స మరియు సహాయక బృందాలతో కలిసి పనిచేసే విధానంపై శిక్షణ ఇస్తామన్నారు. ఇక్కడ శిక్షణ పొందిన వారు మరో 10 మందిని సిద్ధం చేసి ప్రజల్లో భరోసా నింపాలని కోరారు.

రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు చెందిన 105 మంది యువ వాలంటీర్లు ఈ శిక్షణలో పాల్గొంటున్నారు. అగ్ని ప్రమాదాలు, వరదలు, భూకంపాల వంటి సమయాల్లో గందరగోళం లేకుండా ఎలా నాయకత్వం వహించాలనే అంశాలపై నిపుణులు అవగాహన కల్పిస్తారు. ఈ కార్యక్రమంలో హైడ్రా అధికారులు జయప్రకాశ్, గౌతమ్, ఎస్‌డీఎంఏ నోడల్ ఆఫీసర్ గౌతం, యూత్ ఆఫీసర్ ఖుష్బూ, ఏడీఎఫ్‌వో మోహనరావు తదితరులు పాల్గొని వాలంటీర్లకు దిశానిర్దేశం చేశారు.