|  
● FLASH NEWS
Drugs: డ్రగ్స్ ముఠాలకు హైదరాబాద్ సీపీ హెచ్చరిక.. ఇక ఆస్తులపైనే గురి!  •  Congress: సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారు.. కేపీ వివేకానంద్ ఫైర్  •  Trump: ఇరాన్‌పై దాడులకు తొందరపడొద్దన్న ట్రంప్  •  BRS: సిద్దిపేట సభ అట్టర్ ఫ్లాప్.. రేవంత్‌పై గట్టు రాంచందర్ రావు ఫైర్  •  Chukka: చుక్కా రామయ్య సలహాలతో ముందుకెళ్తాం.. సీఎం రేవంత్ వెల్లడి  •  JEE: సెషన్-1 దరఖాస్తు గడువు ముగింపు.. అభ్యర్థులకు అలర్ట్  • 
Skip to content

Housing: జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై కోదండరాం మద్దతు.. 18 ఏళ్లుగా ఎదురుచూపులు

హైదరాబాద్, సూర్య న్యూస్ : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఎం. కోదండరాం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సమస్య పరిష్కారం కోసం గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం (నవంబర్ 20) ఇందిరా పార్కు ధర్నాచౌక్‌లో మహాధర్నా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. జర్నలిస్టులు కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సమాజానికి సమాచారం అందిస్తూ ప్రజాస్వామ్యంలో కీలక పాత్ర పోషించే వారికి సొంత ఇళ్ల స్థలాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల డిమాండ్‌తో ధర్నాలో పాల్గొన్న జర్నలిస్టులు
ఇళ్ల స్థలాల డిమాండ్‌తో ధర్నాలో పాల్గొన్న జర్నలిస్టులు

18 ఏళ్లుగా కొనసాగుతున్న పోరాటం

ధర్నాకు అధ్యక్షత వహించిన గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు మామిడి సోమయ్య మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు సాధించేందుకు తమ సొసైటీ గత 18 సంవత్సరాలుగా పోరాటం చేస్తోందని తెలిపారు. గత ప్రభుత్వాలు ఇళ్ల స్థలాల కేటాయింపు విషయంలో హామీలు ఇచ్చినా సమస్య పరిష్కారం కాలేదని ఆయన ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లు కావస్తున్నా జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యకు పరిష్కారం లభించలేదని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు.

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం నిర్వహించిన ధర్నా వేదికపై ప్రసంగిస్తున్న నాయకుడు
ధర్నా వేదికపై ప్రసంగిస్తున్న నాయకుడు

సొసైటీపై తప్పుడు ప్రచారం చేయొద్దని హెచ్చరిక

జర్నలిస్టు సంఘాల పేరుతో కొందరు వ్యక్తులు తమ సొసైటీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మామిడి సోమయ్య ఆరోపించారు. ఇలాంటి చర్యలను సహించబోమని హెచ్చరించారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ, ప్రభుత్వం ఈ అంశంపై తక్షణమే స్పందించాలని కోరారు.

ధర్నాకు వివిధ సంఘాలు, నాయకుల మద్దతు

ఈ మహాధర్నాకు పలు రాజకీయ పార్టీలు, జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు మద్దతు తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా అధ్యక్షురాలు హేమ సుదర్శన్, జై స్వరాజ్ పార్టీ అధ్యక్షుడు కాసాని శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ జనసమితి అధికార ప్రతినిధి సలీమ్ పాషా, నగర అధ్యక్షుడు ఎం. నర్సయ్య, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్, తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆలిండియా వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె. కోటేశ్వరరావు తదితరులు పాల్గొని జర్నలిస్టుల డిమాండ్‌కు మద్దతు తెలిపారు.

గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ కార్యదర్శి బొల్లం శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్టులు మెరుగు చంద్రమోహన్, ప్రియా చౌదరి, టీడబ్ల్యూజేఎఫ్ నాయకులు కుంచం శ్రీనివాస్, వి. రవికుమార్, ఎం. రవికుమార్, సొసైటీ డైరెక్టర్లు యగ్రమిల్లి రామారావు, వీరేశం, మహిళా జర్నలిస్టులు సీబీ లక్ష్మి, నాగవాణి తదితరులు ధర్నాలో పాల్గొన్నారు.

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను ఇకపై కూడా పెండింగ్‌లో ఉంచకుండా ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని ధర్నాలో పాల్గొన్న పలువురు నాయకులు కోరారు. అర్హులైన జర్నలిస్టులను గుర్తించి పారదర్శక విధానంలో ఇళ్ల స్థలాలు కేటాయించాలని, దీర్ఘకాలంగా కొనసాగుతున్న సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు.

ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు