
కుత్బుల్లాపూర్, సూర్య న్యూస్: అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డికి ఆహ్వానం అందజేశారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ మరియు నల్లమల్లి ఆదర్శ మహిళా చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని కోరుతూ నిర్వాహకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు ప్రగతి నగర్‌లోని ఆయన నివాసంలో ఆహ్వాన పత్రికను అందజేసి కార్యక్రమ వివరాలను వివరించారు.
ఈ నెల 18-03-2026, బుధవారం నాడు ప్రగతి నగర్‌లోని శ్రీకృష్ణ గార్డెన్స్ ఏసీ ఫంక్షన్ హాల్లో ఈ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. సమాజంలో మహిళల పాత్రను గౌరవిస్తూ నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో భాగంగా పలువురు ప్రతిభావంతులైన మహిళలను సత్కరించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నల్లమల్లి సామ్రాజ్యలక్ష్మి (వాసవి క్లబ్ జోనల్ చైర్పర్సన్ & ట్రస్ట్ ఫౌండర్ చైర్పర్సన్), దేవరశెట్టి స్రవంతి, రాధిక, అనంతలక్ష్మి (ప్రోగ్రాం కోఆర్డినేటర్స్) పాల్గొన్నారు. వీరితో పాటు వాసవి క్లబ్ సమైక్యశక్తి ప్రగతి నగర్ అధ్యక్షులు ఉప్పల వినయ్, జనరల్ సెక్రటరీ పోలా వెంకట్, వాసవి క్లబ్ వనిత సమైక్యశక్తి అధ్యక్షురాలు పోలా సంధ్య తదితరులు పాల్గొని కొలన్ హన్మంత్ రెడ్డిని ఆహ్వానించారు.