
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరి టిడ్కో (TIDCO) కాలనీలో గురువారం రాత్రి ఒక చిన్న గొడవ పెను విషాదానికి దారితీసింది. కేవలం టీవీ వాల్యూమ్ తగ్గించమన్నందుకు ఒక భార్య తన భర్తను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం షేక్ అహ్మద్ (27) ఏసీ మెకానిక్‌గా పనిచేస్తూ తన భార్య క్రాంతి మరియు ఇద్దరు పిల్లలతో కలిసి టిడ్కో కాలనీలో నివసిస్తున్నాడు. రంజాన్ ఉపవాస దీక్షలో ఉన్న అహ్మద్ గురువారం రాత్రి ఇంటికి వచ్చిన సమయంలో భార్య టీవీ చూస్తోంది. వాల్యూమ్ ఎక్కువగా ఉండటంతో దానిని తగ్గించాలని అహ్మద్ కోరాడు. ఈ చిన్న విషయంపై ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది.
గొడవ తీవ్రం కావడంతో ఆవేశానికి లోనైన క్రాంతి ఇంట్లోని కత్తితో అహ్మద్‌పై దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన అహ్మద్‌ను స్థానికులు వెంటనే చినకాకాని ఆసుపత్రికి అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న మంగళగిరి సీఐ సామవేదం ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితురాలు క్రాంతిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. చిన్నపాటి గొడవ ఇద్దరు చిన్నారులను అనాథలను చేయడంతో కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి