
హైదరాబాద్, సూర్య న్యూస్ : తెలంగాణ మంత్రివర్గ విస్తరణ (Telangana Cabinet Expansion), శాఖల పునర్వ్యవస్థీకరణపై రాజకీయ వర్గాల్లో చర్చ మళ్లీ జోరందుకుంది. ఈ క్రమంలో మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి (Komatireddy Rajagopal Reddy) మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాలు ఉన్నాయంటూ రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఈ అంశంపై అటు ప్రభుత్వం నుంచి గానీ, ఇటు పార్టీ అధిష్టానం నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఇటీవల మంత్రుల శాఖల మార్పుపై వచ్చిన వార్తలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. కేబినెట్ కూర్పు, శాఖల కేటాయింపుపై తుది నిర్ణయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ హైకమాండ్ పరిధిలోనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సెప్టెంబర్ 3న కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించిన తర్వాత కేబినెట్లో ఏర్పడిన ఖాళీల భర్తీ అనివార్యంగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే రాజగోపాల్ రెడ్డి పేరు ప్రముఖంగా తెరపైకి వస్తోంది.
మున్సిపల్ శాఖ దక్కే ఛాన్స్?
రాజగోపాల్ రెడ్డికి కీలకమైన మున్సిపల్ పరిపాలన శాఖను కేటాయించే యోచనలో అధిష్టానం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ఓ మంత్రి శాఖల్లో మార్పులు చేసి సర్దుబాటు చేస్తారనే వార్తలు సైతం చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వివరాలపై ఎలాంటి అధికారిక స్పష్టత లేదు. గతంలో ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేసిన రాజగోపాల్ రెడ్డి, ఇటీవల ప్రభుత్వ నిర్ణయాలకు అనుకూలంగా మాట్లాడటం కూడా ఆయనకు మంత్రి పదవి దక్కబోతోందనే ప్రచారానికి బలం చేకూరుస్తోంది.
ఒకే కుటుంబానికి రెండు పదవులు సాధ్యమేనా?
మరోవైపు ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి మంత్రి పదవులు సాధ్యమవుతాయా అనే అంశంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. ఒకే ఉమ్మడి నల్గొండ జిల్లా, ఒకే కుటుంబం, ఒకే సామాజిక వర్గం నుంచి మరో పదవి కేటాయిస్తే ఇతర సీనియర్ల నుంచి అసంతృప్తి వ్యక్తమయ్యే ప్రమాదం ఉందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ అధిష్టానం దీనిపై అధికారిక ప్రకటన జారీ చేసే వరకు ఈ సస్పెన్స్‌కు తెరపడే అవకాశం లేదు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



